సిద్ధలకోనలో 167 నూతన నాగశిలల ప్రతిష్ఠా మహోత్సవం వైభవం! వేద మంత్రోచ్ఛారణల నడుమనాగశిలలకుప్రాణప్రతిష్ఠ.. ముఖ్య అతిథిగా బ్రహ్మశ్రీ రామాయణం మహేష్ స్వామి
సైదాపురం, మేజర్ న్యూస్ : దట్టమైన ఆహ్లాదకరమైన అటవీ ప్రాంతంలో, నెల్లూరు జిల్లా లోని సైదాపురం కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో వెలసిన ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీ మూగ సిద్ధలయ్య స్వామి కొలువైన సిద్ధలకోనలో 167 నూతన నాగశిలల ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తుల భక్తిశ్రద్ధల మధ్య వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.భారతీయ సాధు సరిత్ సభ్యులు, బ్రహ్మశ్రీ అల్లూరు పీఠాధిపతి రామాయణం మహేష్ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొనగా, గుండా పంతుల రామ సుబ్రహ్మణ్యం శర్మ, రామాయణం మణిశంకర్ అయ్యర్ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణలతో 167 నూతన నాగశిలలకు ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. ఉభయదాతల సహకారంతో ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ పీఠాధిపతి రామాయణం మహేష్ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే సద్గురు మేధా దక్షిణామూర్తి గర్భాలయం కలిగిన విశిష్టమైన దేవాలయాల్లో సైదాపురం సిద్ధలకోనకు ప్రత్యేకమైన ప్రాశస్త్యం ఉందన్నారు. సుమారు 500 సంవత్సరాల క్రితం సారంగధరుల చరిత్రతో ఈ క్షేత్రానికి అనుబంధం ఉందని, రాజ్యం కోల్పోయిన సమయంలో సిద్ధలయ్య స్వామి అనుగ్రహంతో తిరిగి రాజ్యాన్ని పొందేలా సిద్ధుల ఆశీస్సులు లభించాయని వివరించారు. అంతటి మహిమాన్వితమైన క్షేత్రంలో భక్తులు తమ కోరికలు నెరవేరాలని స్వామివారిని కొలుస్తారనిపేర్కొన్నారు.సర్పసహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు కలగాలని, లోకకళ్యాణార్థం మేధా దక్షిణామూర్తి సన్నిధిలో నాగశిలల ప్రతిష్ఠ చేపట్టడం అభినందనీయమన్నారు. పాలడుగు వెంకటసాయి కార్తీక మాసంలో అన్నదాన కార్యక్రమాలతో ప్రారంభించిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ, కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొనడం ప్రశంసనీయమని కొనియాడారు.విద్యాభివృద్ధి కోరుకునే విద్యార్థులు, వివాహం ఆలస్యమవుతున్న వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, రుణబాధల నుంచి విముక్తి కోరుకునేవారు భక్తిశ్రద్ధలతో మూగ సిద్ధలయ్య స్వామిని దర్శించుకుని సహస్రనామ అర్చనలు, పారాయణలు నిర్వహించాలని స్వామీజీ సూచించారు. క్షేత్రంలోని గ్రహాలకు సంబంధించిన నాగశిలలకు అభిషేకాలు నిర్వహించి ఆధ్యాత్మిక ఫలితాలను పొందాలని భక్తులకు పిలుపునిచ్చారు.ఈ ప్రతిష్ఠా మహోత్సవానికి రాష్ట్రంలోని నలుమూలలతో పాటు విజయనగరం, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ఒగ్గు కిష్టయ్య, వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో గూడూరు కోర్టు ఏపీపీ ప్రకృతి కుమార్, హైకోర్టు న్యాయవాది రాజు, పాలడుగు వెంకటసాయి తదితరులు పాల్గొన్నారు.