ఎన్టీఆర్ జిల్లాలో పచ్చదనం పెంపునకు ప్రత్యేక కార్యాచరణ
విజయవాడ, మేజర్ న్యూస్: ఎన్టీఆర్ జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ అధికారులను ఆదేశించారు. మొక్కల పెంపకం, సంరక్షణ కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంలా నిర్వహించి, గ్రీనింగ్ కార్యక్రమాల అమలులో రాష్ట్రంలోనే జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో పచ్చదనం అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిక్ట్ గ్రీనింగ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ సొసైటీ రిజిస్ట్రేషన్, భవిష్యత్ కార్యాచరణపై శుక్రవారం కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సొసైటీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో మొక్కలు నాటేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించి, అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
అటవీ, వ్యవసాయ, ఉద్యానవన, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తూ సమగ్ర కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ప్రతి శాఖకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో ఏజెన్సీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.వి. సుబ్రహ్మణ్యం రాఘవరావు, జిల్లా అటవీ శాఖ అధికారి జి. సతీష్, జెడ్పీ సీఈఓ పి. సుశీల, ఉద్యానవన శాఖ అధికారి పి. బాలాజీ కుమార్, అదనపు మున్సిపల్ కమిషనర్ డి. చంద్రశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి సీతామహాలక్ష్మి, డ్వామా, డీఆర్డీఏ, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.