మహిళా సంఘాల బలోపేతానికి వీవో భవనం దోహదం
మహిళా సంఘాల బలోపేతానికి వీవో భవనం దోహదం
సూర్య, లక్షెట్టిపేట : మండలంలోని పాత కొమ్ముగూడెం గ్రామపంచాయతీ పరిధిలో వీవో భవన నిర్మాణానికి శుక్రవారం సర్పంచ్ దుమ్మని సత్తన్న భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమాజంలోని పేదరిక నిర్మూలనలో పొదుపు సంఘాల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మహిళా సంఘాలు బలోపేతమైతే మహిళల ఆర్థిక స్వావలంబన పెరగడంతో పాటు సమాజ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చొప్పదండి రవి, వార్డు సభ్యులు బేక్కం సృజన్, రేగుంట హరీష్, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, సీసీ జనార్దన్, వీవో సభ్యులు సూరం శిరీష, బిరుదుల రాజ్యలక్ష్మి, లావణ్య, యూత్ అధ్యక్షుడు శ్రీ వరుణ్ తదితరులు పాల్గొన్నారు.