మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-ఆప్షన్ సభ్యుల పరోక్ష ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*
కర్నూలు, నవంబర్ 13:.ఈ నెల 19 వ తేదీన జిల్లాలో మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-ఆప్షన్ సభ్యుల పరోక్ష ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు...
ఈ నెల 19 వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరోక్ష ఎన్నికల నిర్వహణ అంశం పై శుక్రవారం కలెక్టరేట్ నుండి సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19 వ తేదీన మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-ఆప్షన్ సభ్యుల పరోక్ష ఎన్నికల ప్రక్రియ కు ఆయా మండలాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. L. ఈ నెల 19 వ తేదీన ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ చేపట్టాలని, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన నిర్వహించాలని, మధ్యాహ్నం 12 గంటలలోపు అర్హత కలిగిన నామినేషన్లను ప్రకటించడంతో పాటు, మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించాలని కలెక్టర్ తెలిపారు. కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నామినేషన్లను నిబంధనల ప్రకారం స్వీకరించాలన్నారు. ప్రతి నామినేషన్‌కు ఒక ప్రతిపాదకుడు, మరొక బలపరిచే సభ్యుడు ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఒకే ఒక్క నామినేషన్ దాఖలైతే సంబంధిత అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించవచ్చని కలెక్టర్ తెలిపారు. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు ఉంటే నిబంధనల ప్రకారం చేతులెత్తే విధానం (Show of Hands) ద్వారా ఎక్కువ మంది మద్దతు పొందిన అభ్యర్థిని ఎన్నికైనట్లు ప్రకటించాలన్నారు.
మధ్యాహ్నం ఒంటిగంటకు మండల పరిషత్ సమావేశం ప్రారంభించి, ముందుగా ప్రత్యక్షంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించాలన్నారు. ఇందుకు సంబంధించిన ప్రమాణ స్వీకార పత్రాలను ఇప్పటికే మండలాలకు పంపించినట్లు కలెక్టర్ తెలిపారు. సంబంధిత మండల పరిధిలోని ఎంపీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అర్హత కలిగిన ఎమ్మెల్సీలకు సమావేశ నోటీసులు అందజేయాలన్నారు. అయితే ఓటు హక్కు ప్రత్యక్షంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులకు మాత్రమే ఉంటుందని, ఇతరులు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా సమావేశానికి హాజరుకావచ్చని, వారికి ఓటు హక్కు ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు.
కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికతో పాటు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల సమావేశాలకు 50 శాతం కోరం తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మొత్తం సభ్యుల సంఖ్య ఆధారంగా అవసరమైన కనీస హాజరును ముందుగానే నిర్ధారించుకోవాలన్నారు. కోరం లేని పక్షంలో నిబంధనల ప్రకారం సమావేశాన్ని వాయిదా వేయాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే సమావేశంలో మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల ప్రక్రియ చేపట్టాలన్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే చేతులెత్తే విధానం ద్వారా ఓటింగ్ నిర్వహించాలని, సమాన ఓట్లు వచ్చిన సందర్భంలో నిబంధనల ప్రకారం లాటరీ విధానాన్ని అనుసరించాలన్నారు. లాటరీ నిర్వహణలో సమాన పరిమాణం, ఒకే రంగు కలిగిన చీటీలను ఉపయోగించాలని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా సమావేశ మందిరాల్లో సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం 20 వ తేదీన జిల్లా పరిషత్ లో జిల్లా పరిషత్ చైర్మన్ కు సంబంధించిన ఎన్నికలు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు.
సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ సుధాకర్ రెడ్డి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు, ఆదోని ఆర్డీఓ అరుణ దేవి, ఎంపిడిఓ లు తదితరులు పాల్గొన్నారు.