పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ప్రణాళిక
నెల్లూరు, అర్బన్/క్రైమ్, మేజర్ న్యూస్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ప్రణాళిక రూపొందించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆదేశించారు.జిల్లాలోని 35 మండలాల పరిధిలో 700 గ్రామ పంచాయతీలకు మూడు విడతలుగా, మూడు మున్సిపాలిటీల్లో జరగనున్న ఎన్నికల్లో సుమారు 14.72 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆమె ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.ఇటీవల జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా, ప్రశాంతంగా నిర్వహించడంపై ఎస్పీ అభినందనలు తెలిపారు.ఇదే స్ఫూర్తితో రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను మరింత అప్రమత్తతతో నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా పల్లె నిద్రలు, ఫ్లాగ్ మార్చ్‌లు, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు, నాకాబందీ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సూచించారు. లాడ్జీలు, సత్రాలను తనిఖీ చేయడంతోపాటు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంచాలన్నారు.అలవాటుపడిన నేరస్తులు, అల్లర్లకు పాల్పడే వ్యక్తులను గుర్తించి బైండోవర్ కేసులు నమోదు చేయాలని, గతంలో బైండోవర్ అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అవసరమైన సందర్భాల్లో ఆస్తుల జప్తు చర్యలు చేపట్టి ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు.ప్రతి కేసులో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు.సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ ఆధారాలు, శాస్త్రీయ ఆధారాలను సేకరించి పకడ్బందీగా దర్యాప్తు చేయడం ద్వారా నేర నిర్ధారణ శాతం పెంచాలన్నారు. పరారీలో ఉన్న నిందితులను గుర్తించి అరెస్టు చేయాలని, పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లను ప్రత్యేక కార్యాచరణతో అమలు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులకు సంబంధించిన మిస్సింగ్ కేసులను అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు.డ్రోన్ సర్వైలెన్స్‌ను విస్తృతంగా వినియోగించుకోవాలని, ముఖ్యమైన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపార సంస్థల యజమానులకు అవగాహన కల్పించాలని సూచించారు. రాత్రి వేళల్లో పోలీసు గస్తీని ముమ్మరం చేసి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేయాలన్నారు.అవసరమైన చోట వేలిముద్రలు సేకరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతోపాటు డ్రగ్ డిటెక్షన్ కిట్లను వినియోగించాలని ఆదేశించారు.ప్రతి ఓటరు నిర్భయంగా ఓటు వేసేలా పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాలను సందర్శించాలని ఎస్పీ పేర్కొన్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకం కావాలని, పల్లె నిద్రల ద్వారా వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న పాత కక్షలు, భూవివాదాలు, ఇతర వివాదాలను ముందుగానే గుర్తించి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.
సైబర్ బాధితులకు రూ.63.17 లక్షల రీఫండ్
జిల్లాలో సైబర్ నేరాల నివారణతోపాటు బాధితులకు న్యాయం అందించడంలో నెల్లూరు సైబర్ వింగ్ విశేషంగా పనిచేస్తోందని ఎస్పీ తెలిపారు. తన స్వీయ పర్యవేక్షణలో ఎం ఆర్ ఎం (మనీ రిస్టోరేషన్ మాడ్యూల్) పోర్టల్ ద్వారా 2026 మే, జూన్ నుంచి ఇప్పటివరకు 802 మంది సైబర్ నేర బాధితులకు మొత్తం రూ.63.17 లక్షల నగదును తిరిగి అందించినట్లు వెల్లడించారు. రీఫండ్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితులతో స్వయంగా మాట్లాడి, వారి సమస్యలు, పోలీసుల ద్వారా అందిన సహాయంపై వివరాలు తెలుసుకుని భరోసా కల్పించారు. బాధితులకు సకాలంలో స్పందించి నగదు తిరిగి అందించేందుకు కృషి చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా అందే ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా నిష్పక్షపాతంగా పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. డయల్ 112 ద్వారా వచ్చే అత్యవసర కాల్స్‌కు తక్షణమే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు సహాయం అందించాలని సూచించారు.సమావేశంలో స్మార్ట్ పోలీసింగ్, పెండింగ్ గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, హత్యలు, ఫోక్సో, అత్యాచారాలు, దోపిడీలు, ఆస్తి నేరాలు, ఎన్నికల సంబంధిత కేసులు, వాహనాల చోరీలు, మిస్సింగ్, చీటింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, ఎన్ డి పి ఎస్ కేసుల దర్యాప్తు, రికవరీలు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలు, పెండింగ్ వారెంట్ల అమలు తదితర అంశాలపై సర్కిల్ వారీగా సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పోలీస్ పైలట్ ప్రాజెక్ట్ ఆపరేషన్ త్రిశూల్ అమలుపైనా ప్రత్యేకంగా చర్చించి అవసరమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు.ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సీహెచ్. సౌజన్య, టౌన్ ఏఎస్పీ దీక్ష ఐపీఎస్, రూరల్, కావలి, ఆత్మకూరు, గూడూరు, మహిళా పోలీస్ స్టేషన్, రిజర్వ్ డీఎస్పీలు, ఏఓ, ఏఏఓలు, డీపీఓ అధికారులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.