పదేళ్ల పాలనలో రైతులను ముంచింది ఎవరో ప్రజలకు తెలుసు!రసమయి బాలకిషన్‌కు మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేవెల్లి రాజలింగం కౌంటర్
సూర్య - మానకొండూర్ :మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మార్కెట్ యార్డు సందర్శన పేరిట అసత్య ప్రచారాలు చేస్తున్నారని మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రేవెల్లి రాజలింగం విమర్శించారు. మానకొండూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రేవెల్లి రాజలింగం మాట్లాడుతూ, రసమయి బాలకిషన్ పదేళ్ల పాలనలో మంచి ధాన్యానికి కూడా రైస్ మిల్లర్లు క్వింటాల్‌కు 5 నుంచి 10 కిలోల వరకు తరుగు పేరిట కోత విధించారని, అప్పట్లో మిల్లుల వద్ద ధాన్యం కుప్పలకు నిప్పు పెట్టిన రోజులను, రోడ్లపై ధర్నాలు చేసిన రోజులను రైతులు ఇంకా మర్చిపోలేదని గుర్తు చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు రైతులను ప్రోత్సహించడంతో నియోజకవర్గంలో 70 నుంచి 80 శాతం మంది సన్నవడ్లు సాగు చేశారని చెప్పారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సన్నవడ్లకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా క్వింటాల్‌కు రూ. 3,000 నుంచి రూ. 3,500 వరకు రికార్డు స్థాయి ధర పలుకుతుండటంతోనే రైతులు స్వచ్ఛందంగా బయట అమ్ముకుంటున్నారని వివరించారు. సన్నవడ్లు, దొడ్డువడ్ల వివరాలు తెలుసుకునేందుకే వ్యవసాయ అధికారులు రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నారని, దీనిని రసమయి రాజకీయ లబ్ధి కోసం వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. మార్కెట్ యార్డులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి కోసం రంజన్లు, ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. గతంలో మాదిరిగా కేవలం ప్రారంభోత్సవాలు చేసి వదిలేసే సంస్కృతి తమది కాదని, మిల్లర్లకు సంబంధించిన పాత స్టాక్ క్లియరెన్స్, డీడీల అంశాలపై ప్రభుత్వం చర్చిస్తోందని, మిగిలిన ధాన్యాన్ని కూడా పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని తెలిపారు. పదేళ్ల పాటు శాసనసభ్యుడిగా పనిచేసిన వ్యక్తి బాధ్యతాయుతంగా మాట్లాడాలని, రైతులను తప్పుదోవ పట్టించే విధంగా అబద్ధపు ప్రచారాలు చేస్తే సహించేది లేదని రేవెల్లి రాజలింగం హెచ్చరించారు.
రైతులు ఎవరు అధైర్య పడవద్దని రెండు నుంచి మూడు రోజుల్లో మిల్లులు అలర్ట్ చేయడం జరుగుతుందన్నారు. సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ అందివ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ద్యావ శ్రీనివాసరెడ్డి, మానకొండూర్ సొసైటీ చైర్మన్ నాగిశెట్టి రాజయ్య డైరెక్టర్లు రామినేని రమణ, కనకం అశోక్ ,దూలం వీరస్వామి గౌడ్, రాపాక రాజేశ్వర్, కవిత, తమ్మిశెట్టి రాజేష్, కుంభం చిరంజీవి, ఏనుగు చొక్కా రెడ్డి,నాయకులు కనకం కుమార్,కొండ్ర సురేష్, జీడి శ్యామ్, కానుగంటి రమేష్, కొండ్ర రాంబాబు,తదితరులు పాల్గొన్నారు..