30 ఏళ్ల గ్రామస్తుల కష్టం.. అధికారుల మౌనం --గ్రామ చందాలతో కొనుగోలు చేసిన ఎకరం భూమికి బోర్డు వివాదం.. --ఉన్నతాధికారుల లేఖలకూ స్పందన కరువు.. -+8 నెలలుగా పరిష్కారానికి నోచుకోని సమస్య.. --సొంత పాఠశాలలోనే వివాదాన్ని చక్కదిద్దలేని ఎంఈఓ తీరుపై గ్రామస్తుల అసహనం
--30 ఏళ్ల గ్రామస్తుల కష్టం.. అధికారుల మౌనం
--గ్రామ చందాలతో కొనుగోలు చేసిన ఎకరం భూమికి బోర్డు వివాదం..
--ఉన్నతాధికారుల లేఖలకూ స్పందన కరువు..
-+8 నెలలుగా పరిష్కారానికి నోచుకోని సమస్య..
--సొంత పాఠశాలలోనే వివాదాన్ని చక్కదిద్దలేని ఎంఈఓ తీరుపై గ్రామస్తుల అసహనం
వైరా రూరల్ (సూర్య న్యూస్):-
మూడు దశాబ్దాల క్రితం గ్రామస్తుల ఐక్యతకు ప్రతీకగా నిలిచిన పాఠశాల స్థలం నేడు వివాదాలకు కేంద్రంగా మారింది. భావితరాలకు విద్య అందించాలనే గొప్ప ఆశయంతో రైతులు, గ్రామ పెద్దలు, ప్రజలు చందాలు వేసుకుని కొనుగోలు చేసిన ఎకరం భూమిపై బోర్డు వివాదం నెలకొంది. ఎనిమిది నెలలుగా సమస్య కొనసాగుతున్నా పరిష్కారం చూపాల్సిన అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖ ఉన్నతాధికారులు సైతం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలు పంపినప్పటికీ క్షేత్రస్థాయిలో కదలిక లేకపోవడం గ్రామస్తుల్లో ఆగ్రహం రేపుతోంది.
*గ్రామస్తుల చందాలతో ఎకరం భూమి కొనుగోలు*
వైరా మండలం గన్నవరం గ్రామంలో 1991లో హైస్కూల్ ఏర్పాటు చేయాలనే సంకల్పంతో అప్పటి గ్రామస్తులు, రైతులు, గ్రామ పెద్దలు ఒక్కటయ్యారు. లక్కిరెడ్డి వెంకటరామిరెడ్డి వద్ద సుమారు రూ.40 వేలతో ఎకరం భూమిని గ్రామస్తులంతా చందాలు వేసుకుని కొనుగోలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం గ్రామస్తులు చేసిన ఈ త్యాగం నేటికీ గుర్తుండిపోయే అంశం.
*ఐదేళ్ల క్రితం బోర్డుతో మొదలైన వివాదం*
భూమి కొనుగోలు చేసినప్పటి నుంచి సుమారు ఐదుగురు సర్పంచులు మారినా పాఠశాల స్థలానికి ఎలాంటి బోర్డు ఏర్పాటు చేయలేదని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఐదేళ్ల క్రితం వేమిరెడ్డి విజయలక్ష్మి సర్పంచ్‌గా ఉన్న సమయంలో స్థలదాత వెంకటరామిరెడ్డి పేరుతో బోర్డు ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. గ్రామపంచాయతీ తీర్మానం లేకుండా, గ్రామస్తులకు సమాచారం ఇవ్వకుండా బోర్డు ఏర్పాటు చేశారన్నది స్థానికుల అభ్యంతరం.
*బస్సు ఢీ కొనడంతో మళ్లీ రాజుకున్న వివాదం*
వేమిరెడ్డి విజయలక్ష్మి పదవీకాలం ముగిసిన తర్వాత కారుమంచి యేసు సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో చింతకాని మండలం జగన్నాథపురంలో జరిగిన ముఖ్యమంత్రి కార్యక్రమానికి ప్రజలను తరలించేందుకు ఏర్పాటు చేసిన బస్సు ప్రమాదవశాత్తు పాఠశాల వద్ద ఉన్న బోర్డును ఢీకొనడంతో అది కిందపడిపోయింది. తిరిగి బోర్డు ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరగడంతో గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గ్రామస్తుల చందాలతో కొనుగోలు చేసిన స్థలానికి సంబంధించి గ్రామం అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. దీంతో వివాదం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు చేరింది.
*ఉన్నతాధికారుల లేఖలకూ విలువ లేదా?*
ఈ వివాదం విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వరంగల్ విద్యాశాఖ ఉన్నతాధికారుల పరిశీలన అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారికి, గన్నవరం సర్పంచ్ కారుమంచి యేసుకు ఐదు రోజుల క్రితం లేఖలు అందినట్లు స్థానికంగా తెలుస్తోంది. నిబంధనల ప్రకారం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖల్లో సూచించినట్లు సమాచారం. అయినప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారానికి స్పష్టమైన చర్యలు కనిపించడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాలకే స్పందన లేకపోతే సామాన్య ప్రజల సమస్యలకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
*సొంత పాఠశాలలోనే సమస్య.. ఎంఈఓ ఏం చేస్తున్నట్లు?*
గన్నవరం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా, మండల విద్యాశాఖ అధికారిగా చావా శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారు. ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్న పాఠశాలలోనే ఎనిమిది నెలలుగా వివాదం కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. సమస్య పరిష్కారానికి ఇప్పటివరకు స్పష్టమైన చొరవ కనిపించకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన పరిధిలోని పాఠశాలలో నెలకొన్న సమస్యనే పరిష్కరించలేకపోతే మండలంలోని ఇతర పాఠశాలల సమస్యలపై ఎలా స్పందిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఎంఈఓ వివరణ తెలియాల్సి ఉంది.
*రికార్డులు బయటపెట్టి.. వివాదానికి ముగింపు పలకాలి!*
మూడు దశాబ్దాల క్రితం గ్రామస్తులందరూ ఒక్కటై కొనుగోలు చేసిన భూమిపై నేడు వివాదం కొనసాగడం బాధాకరం. భూమి కొనుగోలుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు ఏమి చెబుతున్నాయి? భూమి ఎవరి పేరుపై ఉంది? బోర్డు ఏర్పాటుకు గ్రామపంచాయతీ తీర్మానం ఉందా? ఉన్నతాధికారుల లేఖలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అనే ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, గ్రామపంచాయతీ పాలకవర్గం సమన్వయంతో భూమి రికార్డులను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తేవాలి. గ్రామస్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చట్టబద్ధంగా వివాదానికి ముగింపు పలకాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.