BREAKING
జపాన్ ఓపెన్ టోర్నీలో క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ కొమ్మూరు కెనాల్ మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో తెలుగు బ్లాక్‌హాక్స్‌ అంచనాలు.. విజయవాడ వేదికగా సన్నాహాలు అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుతం.. ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా రేపటి నుండి 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : జయప్రదం చేయాలని గ్రంథాలయ అధికారి బి.చంద్రశేఖర్ నాయక్ పిలుపు సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్లే పాటలు చిరకాలం నిలవవు.. అను మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు రైతులను నిండా ముంచుతున్న కొనుగోలు కేంద్రాలు! కలెక్టరేట్ ముట్టడిస్తామని రసమయి బాలకిషన్ హెచ్చరిక సంగీత దర్శకుడు అనిరుధ్ పెళ్లి వేడుకల్లో హాట్‌టాపిక్‌గా మారిన ధనుష్ ఆహ్వానం భారతదేశాన్ని ఒక్కచోట చూడాలంటే అది ఏపీలోనే సాధ్యం. నటుడు గోవిందాతో కలిసి నటి రాణి రోమాంటిక్ ఫొటోలు.. సోషల్ మీడియాలో వైరల్ నేడు వెల్దుర్తి మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కు ఘనస్వాగతం షిరిడీ సాయి సన్నిధిలో మెగా హీరో రామ్ చరణ్ ప్రత్యేక పూజలు వైసీపీకి గుడ్‌బై.. టీడీపీలోకి 26 కుటుంబాలు! ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? చంద్రయాన్ సినిమా రివ్యూ

అందుబాటు ధరల్లో క్యాన్సర్ మందులు: రోగుల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం – శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా

Select Suryaa Now
అందుబాటు ధరల్లో క్యాన్సర్ మందులు: రోగుల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం – శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా

క్యాన్సర్ అనే మాట ఒక కుటుంబ జీవితాన్ని క్షణాల్లో మార్చేస్తుంది. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత రోగులు, వారి కుటుంబ సభ్యులు చికిత్స, ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మందుల ఖర్చులు కుటుంబాలకు అదనపు భారంగా మారుతాయి. ఇలాంటి సమయంలో కుటుంబంలోని ప్రతి వనరును రోగి కోలుకోవడానికి వినియోగించాల్సి ఉంటుంది. కాబట్టి, ఒక బాధ్యతాయుతమైన ఆరోగ్య వ్యవస్థ వ్యాధికి చికిత్స అందించడమే కాదు, దాని కారణంగా కుటుంబాలు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను కూడా పరిష్కరించాలి.

ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 137 నాన్‌-షెడ్యూల్డ్‌ క్యాన్సర్‌ నిరోధక మందులపై ట్రేడ్‌ మార్జిన్లను హేతుబద్ధీకరించింది. క్యాన్సర్‌ చికిత్సను మరింత అందుబాటు ధరల్లోకి తీసుకురావడంలో ఇది ఒక చారిత్రాత్మక ముందడుగు. ఈ నిర్ణయం ప్రకారం, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ మందుల గరిష్ఠ చిల్లర ధర పై ట్రేడ్‌ మార్జిన్‌ను గరిష్ఠంగా 30%నికి పరిమితం చేసింది. సవరించిన ధరలు 2026 నవంబర్ 9 నుంచి అమల్లోకి వచ్చాయి. రోగులు చెల్లించే ధరల్లో పంపిణీ వ్యవస్థకు న్యాయమైన, సముచితమైన మార్జిన్ మాత్రమే ఉండాలి తప్ప, అధిక లాభాల కోసం ధరలను అనవసరంగా పెంచకూడదన్నదే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం.

ఈ నిర్ణయ ఫలితాలు ఇప్పటికే ఔషధ దుకాణాల్లో కనిపిస్తున్నాయి. 80కి పైగా ఔషధ తయారీ సంస్థలు, 137 మందుల్లో 121 మందులకు సంబంధించిన 1,366 ఉత్పత్తుల సవరించిన గరిష్ఠ చిల్లర ధరలను ప్రకటించాయి. వీటిలో ప్రతి ఐదు ఉత్పత్తుల్లో నాలుగు కంటే ఎక్కువ ఉత్పత్తుల ధరలు తగ్గాయి. దాదాపు సగం ఉత్పత్తుల ధరలు 50%నికి పైగా తగ్గగా, కొన్ని మందుల ధరలు గతంతో పోలిస్తే 96%నికి పైగా తగ్గాయి. కీమోథెరపీ చికిత్సను పలుమార్లు చేయించుకోవాల్సిన కుటుంబాలకు ఈ తగ్గింపు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. గత ఏడాది మందుల వినియోగం ఆధారంగా అంచనా వేస్తే, రోగులు, వారి కుటుంబాలకు ఏటా సుమారు రూ.3,500 కోట్ల మేర ఆదా కానుంది. అధిక ట్రేడ్‌ మార్జిన్ల రూపంలో ఖర్చయ్యే ఈ మొత్తం ఇకపై కుటుంబాలకే మిగులుతుంది.

ఈ నిర్ణయం గతంలో చేపట్టిన చర్యల అనుభవం ఆధారంగా తీసుకున్నదే. 2019లో ఎన్పీపీఏ ప్రయోగాత్మకంగా 42 నాన్‌-షెడ్యూల్డ్‌ క్యాన్సర్‌ మందులపై ట్రేడ్‌ మార్జిన్‌ హేతుబద్ధీకరణ చర్యలను చేపట్టింది. దీని ద్వారా 526 బ్రాండ్ల గరిష్ఠ చిల్లర ధరలు 90% వరకు తగ్గాయి. ప్రస్తుతం చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ విధానాన్ని మరింత విస్తరించి 137 మందులకు వర్తింపజేశారు. ప్రముఖ క్యాన్సర్‌ నిపుణులు, వైద్య నిపుణులు, ఆసుపత్రుల ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు సభ్యులుగా ఉన్న నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఈ మందులను గుర్తించారు. ఈ జాబితాను ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన మార్పులు చేస్తారు.

సమానమైన వైద్య సేవలు అందించాలంటే చికిత్స ఖర్చులు అందుబాటులో ఉండటం ఎంతో అవసరం. ముఖ్యంగా భారతదేశం వంటి దేశంలో ఇది మరింత కీలకం. ఒక ఔషధం అందుబాటులో ఉన్నప్పటికీ, దాని ధరను భరించలేని పరిస్థితి ఉంటే రోగికి దాని వల్ల ప్రయోజనం ఉండదు. అత్యవసర ఔషధాల చట్టం, 1955 కింద జారీ చేసిన డ్రగ్స్‌ (ప్రైసెస్‌ కంట్రోల్‌) ఆర్డర్‌ (DPCO), 2013 ప్రకారం ఎన్పీపీఏ మందుల ధరలను నియంత్రిస్తుంది. జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలో ఉన్న మందులకు గరిష్ఠ ధరలను నిర్ణయించడంతో పాటు, నాన్‌-షెడ్యూల్డ్‌ మందుల వార్షిక ధరల పెరుగుదలను కూడా పర్యవేక్షిస్తుంది.

అయితే, మార్కెట్‌ గణాంకాలను విశ్లేషించినప్పుడు కొన్ని నాన్‌-షెడ్యూల్డ్‌ మందుల తయారీదారు వద్ద విక్రయించే ధర, వినియోగదారుడు చెల్లించే ధర మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా క్యాన్సర్‌ మందుల విషయంలో ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉంది. ఎందుకంటే క్యాన్సర్‌ చికిత్సకు ఒకే మోతాదు సరిపోకపోవడంతో, రోగులు పలుమార్లు మందులను కొనుగోలు చేయాల్సి వస్తుంది. మందుల పంపిణీ వ్యవస్థలో అధిక లాభాల మార్జిన్లు, చికిత్సకు అయ్యే భారీ ఖర్చులను గుర్తించిన ప్రభుత్వం ఈ వ్యత్యాసాన్ని సరిచేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ట్రేడ్‌ మార్జిన్లను గరిష్ఠంగా 30 శాతానికి పరిమితం చేసింది.

ఈ నిర్ణయం ద్వారా లభించే పూర్తి ప్రయోజనం రోగులకు, వారి కుటుంబాలకు చేరేలా అమలు ప్రక్రియపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. తయారీదారులు సవరించిన ధరలను ప్రతి ఔషధ దుకాణానికి, ఆసుపత్రికి చేరేలా చూడాలి. ఔషధ దుకాణాలు, ఆసుపత్రులు కూడా ఈ ధరలను స్పష్టంగా ప్రదర్శించడంతో పాటు, వాటిని కచ్చితంగా పాటించాలి. రోగులు, వారి సంరక్షకులు ఎన్పీపీఏ వెబ్‌సైట్‌, 'ఫార్మా సహీ దామ్‌' యాప్‌ ద్వారా సవరించిన ధరలను తెలుసుకోవచ్చు. నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేసినట్లయితే సంబంధిత ఔషధ దుకాణాలు లేదా ఆసుపత్రులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు.

గత 12 ఏళ్లుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో దేశంలో జరుగుతున్న విస్తృత ఆరోగ్య రంగ సంస్కరణల్లో టీఎమ్ఆర్ కూడా ఒక భాగం. ఆరోగ్య సేవలను కొద్దిమందికే పరిమితమైన ప్రత్యేక హక్కుగా కాకుండా, ప్రతి ఒక్కరి గౌరవప్రదమైన జీవనం, ఉత్పాదకత, సామాజిక న్యాయానికి పునాదిగా ఈ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా సమాజంలోని అత్యంత పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.

ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆసుపత్రి వైద్య సేవలు మరింత చేరువయ్యాయి. క్యాన్సర్‌ నివారణ, ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్స అందించేందుకు ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతోంది. జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా అమలవుతున్న అసాంక్రమిక వ్యాధుల నివారణ, నియంత్రణ జాతీయ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 500కు పైగా డే కేర్‌ క్యాన్సర్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కీమోథెరపీతో పాటు ఇతర డే కేర్‌ ఆంకాలజీ సేవలను ప్రజలకు సకాలంలో అందిస్తున్నారు. అదేవిధంగా, ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాల ద్వారా 30 ఏళ్లు పైబడిన పౌరులకు సాధారణ క్యాన్సర్లకు సంబంధించిన ఉచిత స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించే అవకాశం లభిస్తోంది.

అత్యున్నత స్థాయి వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు టాటా మెమోరియల్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో వారణాసి, విశాఖపట్నం, న్యూ చండీగఢ్‌, గువాహటి, సంగ్రూర్‌, ముజఫర్‌పూర్‌లలో 06 ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సమగ్ర క్యాన్సర్‌ వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే దేశంలోని కొత్తగా ఏర్పాటు చేసిన మొత్తం 22 ఎయిమ్స్‌ ల్లోనూ క్యాన్సర్‌ నిర్ధారణ, వైద్య, శస్త్రచికిత్స సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన ద్వారా నాణ్యమైన జనరిక్‌ మందులను తక్కువ ధరలకు అందిస్తున్నారు. అదేవిధంగా, ప్రాణాలను కాపాడే, అత్యవసర మందులను 50 నుంచి 90 శాతం వరకు రాయితీతో అందించేందుకు ప్రభుత్వం అమృత్‌ ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేసింది. చికిత్స ఖర్చులను మరింత తగ్గించేందుకు క్యాన్సర్‌, అరుదైన వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన 36 ప్రాణరక్షక ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్‌ సుంకాన్ని పూర్తిగా మినహాయించింది. క్యాన్సర్‌ మందుల ట్రేడ్‌ మార్జిన్ల హేతుబద్ధీకరణ కూడా అందరికీ అందుబాటు ధరల్లో మందులు అందించాలన్న ప్రభుత్వ విస్తృత లక్ష్యంలో భాగమే.

అదే సమయంలో, ఔషధాల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు, దేశీయ ఔషధ పరిశ్రమ కూడా ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని టీఎమ్ఆర్ గుర్తించింది. దేశ ఆరోగ్య భద్రతకు, ప్రపంచవ్యాప్తంగా ఔషధాల సరఫరాదారుగా భారతదేశ ప్రతిష్ఠకు ఔషధ రంగం సమాన భాగస్వామిగా ఉంది. ప్రభుత్వం విధించిన 30 శాతం పరిమితి ఔషధాల పంపిణీ వ్యవస్థలోని ట్రేడ్‌ మార్జిన్లకు మాత్రమే వర్తిస్తుంది. ఔషధ తయారీదారులు నిర్ణయించే విక్రయ ధరలో ఎలాంటి మార్పు ఉండదు. తద్వారా తయారీ సంస్థలకు న్యాయబద్ధంగా లభించే ఆదాయానికి రక్షణ కల్పించడంతో పాటు, పరిశోధన, అభివృద్ధి, నూతన ఆవిష్కరణల్లో పెట్టుబడులు కొనసాగించే సామర్థ్యాన్ని కూడా కాపాడుతుంది.

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, రోగులకు రక్షణ కల్పించే, నూతన ఆవిష్కరణలను గౌరవించే, బాధ్యతాయుతమైన ఔషధ పరిశ్రమకు మద్దతునిచ్చే, మానవ గౌరవానికి అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చే ఆరోగ్య వ్యవస్థ నిర్మాణం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. వైద్య సాంకేతికతలో సాధించిన పురోగతితోనే ఒక దేశ ఆరోగ్య వ్యవస్థ సామర్థ్యాన్ని అంచనా వేయలేం. అవసరమైన సమయంలో ఆ వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయా లేదా అన్నదే అసలైన ప్రమాణం. ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు అనేకం ఉన్నప్పటికీ, ప్రతి పౌరుడికి నాణ్యమైన, అందుబాటు ధరల్లో, సులభంగా పొందగలిగే వైద్య సేవలు అందుబాటులో ఉండటమే వాటిలో అత్యంత కీలకం.

ఈ నిర్ణయం ద్వారా ప్రాణరక్షక ఔషధాలపై అధిక ట్రేడ్‌ మార్జిన్ల కారణంగా ఏ కుటుంబమూ నివారించగలిగే ఆర్థిక భారాన్ని మోయాల్సిన పరిస్థితి రాకూడదన్న తమ నిబద్ధతను ప్రభుత్వం మరోసారి స్పష్టం చేస్తోంది.