andhrapradesh
అంతర్ కళాశాలల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో నగరం కళాశాలకు ఓవరాల్ ఛాంపియన్‌షిప్
నగరం, మేజర్ న్యూస్:
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన 2026–27 అంతర్ కళాశాలల పురుషుల వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో స్థానిక శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించింది. ఈ పోటీల్లో కళాశాల క్రీడాకారులు మూడు బంగారు పతకాలు, ఒక రజత పతకం సాధించారు. చెన్నైలో జరగనున్న అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యారు. కళాశాలలో ద్వితీయ బి ఏ విద్యార్థులు పి. ప్రవీణ్, బి. రామకృష్ణ, తృతీయ బి సి ఏ విద్యార్థి ఎ. అరుణేష్ బాబులు బంగారు పతకం సాధించగా, ద్వితీయ బి ఏ విద్యార్థి సిహెచ్ వంశీ రజత పతకం కైవసం చేసుకున్నారు. శుక్రవారం కళాశాలలో సెక్రటరీ, కరస్పాండెంట్ వల్లభనేని బుచ్చయ్య చౌదరి క్రీడాకారులను అభినందించి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడారంగంలోనూ ప్రతిభ కనబరచి కళాశాలకు గుర్తింపు తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కళాశాల యాజమాన్యం ఎల్లప్పుడూ అవసరమైన సహకారం అందిస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు కొసరాజు రమణమూర్తి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అనగాని హరికృష్ణ, వైస్ ప్రిన్సిపల్ ప్రసన్న బాబు, సూపరింటెండెంట్ అమరేష్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ లెఫ్టినెంట్ సాంబమూర్తి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.