రూఫ్‌టాప్ సోలార్‌లో ఏపీ దేశానికే ఆదర్శం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
విశాఖపట్నం,మేజర్‌న్యూస్:
పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ అద్భుత ప్రగతి సాధిస్తోందని, రూఫ్‌టాప్ సోలార్ పథకం అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కొనియాడారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు శుక్రవారం ‘సుస్థిర భవిష్యత్తుకు భరోసా – ఇంధన స్థితిస్థాపకత, స్వచ్ఛ సాంకేతికతలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు’ అంశంపై ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో 5 లక్షల ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేయాలని తాను కోరగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో రికార్డు సమయంలో ఏకంగా 7.86 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్ అనుసంధానం పూర్తి చేయడం అభినందనీయమన్నారు. తుపాను సమయంలో దెబ్బతిన్న విద్యుత్ సరఫరాను 24 గంటల్లోనే పునరుద్ధరించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. దేశంలో 2014లో కేవలం 2.8 గిగావాట్లు ఉన్న సౌర విద్యుత్ సామర్థ్యం నేడు 175 గిగావాట్లకు చేరిందని, పీఎం సూర్యఘర్ పథకం కింద దేశవ్యాప్తంగా 66 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని తెలిపారు.
రూ. 43,871 కోట్ల పెట్టుబడులు.. 4,700 మందికి ఉపాధి:
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వివిధ ఇంధన సంస్థలు రూ. 43,871 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 17 అవగాహన ఒప్పందాలను మార్చుకున్నాయి. వీటితో పాటు మరో 3 ప్రాజెక్టులకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఒప్పందాల ద్వారా సుమారు 4,700 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. ప్రధాన పెట్టుబడులలో సారస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (రూ. 15,500 కోట్లు), టెక్సాల్ సీజీఎస్ గ్రీన్ అమ్మోనియా (రూ. 10,759 కోట్లు), సన్‌షూర్ ఎనర్జీ (రూ. 6,550 కోట్లు), బీఎల్‌ఈ రెన్యూవబుల్స్ (రూ. 5,000 కోట్లు), అకాయా ఎనర్జీ (రూ. 3,300 కోట్లు), క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ (రూ. 950 కోట్లు), ఎఫ్‌పీఈఎల్ రాయల పవర్ (రూ. 480 కోట్లు), క్లీన్ ఎడ్జ్ ఇండియా (రూ. 240 కోట్లు) తదితర సంస్థలు ఉన్నాయి.
గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా అమరావతి:
రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మాట్లాడుతూ.. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా 160 గిగావాట్ల హరిత ఇంధన ఉత్పత్తి లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు 114.25 గిగావాట్ల ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చామని, అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
ఫిజీ ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి షాలేన్ కుమార్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల వల్ల చిన్న ద్వీప దేశాలు ఎదుర్కొంటున్న ఇంధన సవాళ్లను అధిగమించేందుకు భారత్ సాంకేతిక సహకారం ఎంతో అవసరమన్నారు. సమన్వయకర్త శాశ్వత్ గోయెంకా (సీఐఐ ఉపాధ్యక్షులు; ఆర్‌పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ వైస్ ఛైర్మన్) మాట్లాడుతూ.. గ్రిడ్ ఆధునికీకరణ, బ్యాటరీ స్టోరేజ్, క్లీన్ టెక్నాలజీ రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులు పెరగాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, వైశాలి నిగమ్ సిన్హా (రీన్యూ సహ వ్యవస్థాపకురాలు), డాక్టర్ బాలకృష్ణ పిసుపాటి (యూఎన్‌ఈపీ ఇండియా హెడ్, కెన్యా), సౌమ్య పార్థసారథి (ఆరప్ గ్రూప్ డైరెక్టర్, యూకే), డిను-నికోలే ఘోర్ఘే (రియూనియన్ బీఎన్‌పీ సీఈవో, రొమేనియా), కెవిన్ ఉన్‌రాత్ (డైనాసెర్ట్ సీఈవో, జర్మనీ), క్యోజీ యోషినో (జేఎఫ్‌ఈ స్టీల్ ఉపాధ్యక్షులు, జపాన్) తదితరులు పాల్గొన్నారు.