మార్టూరులో ఘోర రోడ్డు ప్రమాదం. లారీని వెనుక నుంచి ఢీకొన్న పల్సర్ బైక్.. ఇద్దరు యువకులు మృతి
మార్టూరు, మేజర్‌న్యూస్ :
బాపట్ల జిల్లా మార్టూరు మండలంలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి పల్సర్ బైక్ వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు వైపు ముగ్గురు యువకులు పల్సర్ బైక్‌పై ప్రయాణిస్తున్నారు. ఒంగోలులో బంధువుల వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా, గురువారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో మార్టూరు మండలం జొన్నతాళి ఫ్లైఓవర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా దొనకొండ మండలం వద్దిపాడు గ్రామానికి చెందిన శ్రీరామ్ పేతురు (26), పుల్లలచెరువు మండలం ఐటివరం గ్రామానికి చెందిన మంద సాల్మన్ (20) మృతి చెందారు. మరో యువకుడు వేల్పుల నేహేమియా (18) తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న స్థానికులు క్షతగాత్రుడిని మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగిరాని లోకాలకు ఇద్దరు యువకులు.. ఈ విషాద ఘటనతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.