మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు
మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు
నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో ఎన్నికల నిర్వహణ
జిల్లాలో మొత్తం 10.22 లక్షల మంది ఓటర్లు
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: జిల్లాలో పట్టణ స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లాలో వివిధ పంచాయతీ ఎన్నికల జాబితా ప్రకటించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నోటిఫికేషన్ జారీతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు. జిల్లా లోని మండలాలను మూడు విడతలుగా విభజించి ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. తొలి విడతలో పలమనేరు నియోజకవర్గంలోని 6 మండలాలు, కుప్పం నియోజకవర్గం లోని 3 మండలాలు కలిపి మొత్తం 9 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండో విడతలో పూతలపట్టు నియోజకవర్గం లోని 5 మండలాలు, పుంగనూరు నియోజకవర్గం లోని 2 మండలాలు, నగరి నియోజకవర్గం లోని 3 మండలాలు కలిపి మొత్తం 10 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. మూడో విడతలో జి.డి. నెల్లూరు నియోజకవర్గం లోని 6 మండలాలు, చిత్తూరు నియోజకవర్గం లోని చిత్తూరు రూరల్, గుడిపాల మండలాలు కలిపి మొత్తం 8 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ మూడు విడతల ఎన్నికల్లో భాగంగా నవంబర్ 26న తొలి విడత, నవంబర్ 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్ అధికారుల నియామకాన్ని ఖరారు చేశామని, సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులకు నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, శిక్షకులను కూడా సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సుమారు 10.22 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారని తెలిపారు. ఎన్నికల సందర్భంగా నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు శాఖ సమన్వయంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు, ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రజా స్వామ్యబద్ధంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.