ఆశలకు ఆసరా.. బతుకులకు భరోసా! పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు! దేవరకొండ మండలంలో 1,150 మందికి నూతన పింఛన్లు లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు అందజేసిన ఎమ్మెల్యే బాలు నాయక్
దేవరకొండ ప్రతినిధి నవంబర్ 13:( మేజర్ న్యూస్ )
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ చేయూత మరింత భరోసానిస్తోంది. వృద్ధాప్యంలో ఆసరా కోసం ఎదురుచూసే వృద్ధులు, కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వితంతువులు, జీవనాధారం కోసం ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులకు పింఛన్ ఒక ముఖ్యమైన ఆర్థిక ఆధారం. ఈ నేపథ్యంలో అర్హులైన వారికి నూతన పింఛన్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవరకొండ మండలం, పట్టణ పరిధిలో మొత్తం 1,150 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్లు మంజూరయ్యాయి. శుక్రవారం దేవరకొండ పట్టణంలోని సాయి శివ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొని లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులను పంపిణీ చేశారు.
1,150 మందికి కొత్తగా ఆసరా
దేవరకొండ మండలం, పట్టణ పరిధిలో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు నూతన పింఛన్లు మంజూరు కావడంతో అర్హులైన కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం అందించే పింఛన్ సొమ్ము వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నిత్యావసరాల కొనుగోలు, మందులు, ఇతర వ్యక్తిగత అవసరాలకు కొంతమేర ఆర్థికంగా తోడ్పడనుంది. కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా తమ కనీస అవసరాలను తీర్చుకునేందుకు ఈ పింఛన్ దోహదపడనుంది. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో భాగంగా నూతన పింఛన్ల మంజూరు చేపట్టినట్లు కార్యక్రమంలో పేర్కొన్నారు.
గత పాలనలో పింఛన్లకు ప్రాధాన్యం ఇవ్వలేదు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పింఛన్ల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేదని అన్నారు. ప్రజల అవసరాలు, పేద కుటుంబాల ఇబ్బందులను గుర్తించి సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాల్సిన గత పాలకులు కొత్త పింఛన్ల మంజూరుపై తగిన శ్రద్ధ చూపలేదని ఆరోపించారు. నేడు ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతున్న వారు గతంలో పేదలకు చేసిన మేలేమిటో ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందని బాలు నాయక్ తెలిపారు. ప్రజల కష్టాలను దగ్గరగా చూసిన ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకుని సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు ఇవ్వడం మాత్రమే కాకుండా, వాటిని ఆచరణలో పెట్టి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం, మహిళా సంఘాలకు రుణాలు అందించడం, మహిళల భద్రత కోసం ఇందిరమ్మ భీమా, మహిళా సంఘాలకు మహిళా సమాఖ్య భవనాల ఏర్పాటు వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు, గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పేదలకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ వంటి పథకాల ద్వారా పేద కుటుంబాలకు ఊరట కల్పిస్తున్నామని తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి
దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణం వరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని, పేదల అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు.
లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వుల పంపిణీ
సాయి శివ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా 1,150 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వులు అందజేశారు. ప్రభుత్వ నిర్ణయంతో అర్హులైన వారికి ఆర్థిక భరోసా లభించనుండటంతో కార్యక్రమానికి ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, ఆలంపల్లి నర్సింహా, హనుమంతు వెంకటేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ రయీస్, మండల అధ్యక్షుడు మారుపాకుల సురేష్ గౌడ్, దూదిపాల వేణుధర్ రెడ్డి, లోకసాని శ్రీధర్ రెడ్డి, కొర్ర రాంసింగ్ నాయక్, పట్టణ కౌన్సిలర్లు, మండల సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, నూతన పింఛన్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.