ప్రత్యేక పిల్లలతో బాలల దినోత్సవ వేడుకలు
మహేశ్వరం, మేజర్ న్యూస్: జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మహేశ్వరంలోని వికలాంగుల పునరావాస కేంద్రం (భవిత సెంటర్)లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల్లో ఆనందాన్ని నింపుతూ, వారిలోని ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) శారదమ్మ హాజరై చిన్నారులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి చిన్నారికి సమాన అవకాశాలు కల్పించడం, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రేమ, ఆప్యాయత, ప్రోత్సాహం అందిస్తే వారు కూడా అన్ని రంగాల్లో రాణించగలరని తెలిపారు.బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని వీరందరికీ ప్రత్యేకంగా వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఆటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఎంపీడీవో శారదమ్మ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు విద్య, వైద్యం, పునరావాసం, సామాజిక గౌరవం అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.కార్యక్రమంలో ఎంఈఓ కసనా నాయక్, ఏపీఎం సంతోష్ కుమార్, సీసీలు, భవిత కేంద్రం చిన్నారులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
పాల జనార్ధన్ మేజర్ న్యూస్ మహేశ్వరం రంగారెడ్డి జిల్లా