నటనకు గుడ్‌బై చెప్పడం లేదు.. వస్తున్న పుకార్లపై మాస్టర్ భరత్ స్పష్టత!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బాలనటుడిగా సుమారు ఎనభైకి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన మాస్టర్ భరత్, తాను నటనకు దూరమవుతున్నారంటూ వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చారు. తనదైన కామెడీ టైమింగ్, హావభావాలతో చిన్నవయసులోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భరత్, సినిమాలకు గుడ్‌బై చెబుతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన స్పందిస్తూ నటనను వదిలేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు.
రెడీ, ఢీ, వెంకీ వంటి చిత్రాల్లో భరత్ పండించిన హాస్యం ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోతుంది. చిన్నతనంలోనే బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి వంటి ప్రముఖ నటులతో పాటు పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించి మెప్పించారు. అనంతరం 2019లో వచ్చిన ఏబీసీడీ చిత్రంలోనూ ఆయన ముఖ్య పాత్రలో కనిపించారు. అయితే ఇటీవల ఆయన వైద్య విద్య పూర్తి చేశారన్న వార్తలతో పాటు సినిమాలకు స్వస్తి చెబుతున్నారన్న కథనాలు చక్కర్లు కొట్టాయి.
ఈ ప్రచారంపై మాస్టర్ భరత్ మాట్లాడుతూ తనకు సినిమాలంటే ఎంతో ఇష్టమని, నటనను వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనకు సరిపోయే మంచి కథలు, వైవిధ్యమైన పాత్రలు లభిస్తే తప్పకుండా నటిస్తానని, సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. ఆయన ఇచ్చిన ఈ స్పష్టతతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది మే నెలలో భరత్ తల్లి కమలహాసిని చెన్నైలో గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. తల్లి ప్రోత్సాహంతోనే బాలనటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన భరత్, ఆమె మరణానంతరం సినిమాలకు దూరంగా ఉంటున్నారని, తల్లి కోరిక మేరకు చదువుపై దృష్టి పెట్టారన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే నటనపై తనకున్న ఆసక్తి అలాగే ఉందని భరత్ స్పష్టం చేయడంతో రానున్న రోజుల్లో ఆయనను తిరిగి తెరపై చూసే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read: బోదేపల్లి అంగన్వాడీ కేంద్రంలో జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు