సీన్ లీక్ కావడంతో హడావుడిగా టీజర్ రిలీజ్.. ఛప్రి ఈవెంట్‌లో బండి సరోజ్ కుమార్ భావోద్వేగం!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: మాంగళ్యం, పరాక్రమం, నిర్బంధం వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన బండి సరోజ్ కుమార్ తాజాగా ఛప్రి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, పాటలు, ఎడిటింగ్, సంగీతం, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను సరోజ్ కుమారే స్వయంగా నిర్వర్తించడం విశేషం. బీఎస్కే మెయిన్ స్ట్రీమ్ బ్యానర్‌పై సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీణ్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ చిత్ర టీజర్‌ను ఘనంగా విడుదల చేశారు.
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని సమ్మర్‌లో విడుదల చేయాలని, ఫిబ్రవరిలో టీజర్ విడుదల చేయాలని ప్రణాళిక వేసుకున్నామని, కానీ ఒక సన్నివేశాన్ని జూనియర్ ఆర్టిస్ట్ లీక్ చేయడంతో తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని తెలిపారు. ఆ కారణంగానే టీజర్‌ను ముందుగానే విడుదల చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సెట్‌లో తమకు తగిన భద్రత లేదని, మీడియా సహకారంతోనే తాను ఇక్కడి వరకు వచ్చానని, ఈ కథ కోసం 700 రోజులు శ్రమించి, రివ్యూయర్లను కూడా దృష్టిలో ఉంచుకుని స్క్రీన్‌ప్లే రాసుకున్నానని, వచ్చే సమ్మర్‌లో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తామని చెప్పారు.
నిర్మాత ప్రమోద్ పడమటి మాట్లాడుతూ బండి సరోజ్ కుమార్‌తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో నిర్బంధం చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ కోసం అనుకున్నా యూట్యూబ్‌లో విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చిందని, ఇప్పుడు ఛప్రి చిత్రంతో సరోజ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని, థియేటర్లలో ఈ సినిమా భారీగా అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నటి ఐశ్వర్య మాట్లాడుతూ అసోం నుంచి వచ్చి ఛప్రిలో నటించడం కొత్త అనుభూతిని ఇచ్చిందని, సినిమా అద్భుతంగా వచ్చిందని తెలిపారు.
నటుడు ప్రవీణ్ మాట్లాడుతూ మోగ్లీ సినిమా చూసి సరోజ్‌కు ఫోన్ చేశానని, ఆయనతో పనిచేయడం కొత్త అనుభూతిగా ఉందని, వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదలయ్యే ఈ చిత్రం హీరోగా సరోజ్‌కు మంచి విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు. నటులు అజయ్ సాయి, దివ్య జ్యోతి, రమేష్, జీవా మాట్లాడుతూ తమకు అవకాశం ఇచ్చిన బండి సరోజ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఛప్రి టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందని, త్వరలోనే మరిన్ని అప్‌డేట్‌లతో ముందుకు వస్తామని చిత్రబృందం పేర్కొంది.