డ్రగ్స్ మహమ్మారిపై పోరు కథతో స్కాలర్.. చిల్డ్రన్స్ డే వేళ ఫస్ట్ లుక్ విడుదల!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: కౌశిక్, ప్రతిభా సిన్హా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం స్కాలర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఘనంగా విడుదలైంది. డాక్టర్ భీమగాని సుధాకర్ గౌడ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుధాకర్ గౌడ్, పెంచల్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలిమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో, పొగాకు శిరీష మహేష్ సౌజన్యంతో ఈ ప్రాజెక్టు రూపొందుతోంది. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా తెలుగు ఫిలిం చాంబర్ వేదికగా రామకృష్ణారెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించారు.
ఈ వేడుకకు బీజీఆర్ మైనింగ్ డైరెక్టర్ బాలకోటి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా, జూబ్లీహిల్స్ క్లబ్ ప్రెసిడెంట్ చక్రవర్తి రెడ్డి, రామకృష్ణారెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ చైర్మన్ పెంచల్ రెడ్డి విశిష్ట అతిథులుగా పాల్గొని స్కాలర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. గతంలో పలు సందేశాత్మక బాలల చిత్రాలను రూపొందించిన డాక్టర్ భీమగాని సుధాకర్ గౌడ్ ఈసారి యూత్‌ఫుల్ కమర్షియల్ అంశాలతో సామాజిక సందేశాన్ని జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
కార్యక్రమంలో దర్శక నిర్మాత డాక్టర్ భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ యువతను పెడదోవ పట్టిస్తున్న డ్రగ్స్, గంజాయి మహమ్మారి బారిన పడకుండా ఎలా కాపాడాలనే ప్రధాన ఇతివృత్తంతో ఈ కథను సిద్ధం చేసినట్లు తెలిపారు. డ్రగ్ బానిసలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఓ యువకుడు ఔషధాన్ని కనిపెట్టి అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతాడని, ఆ క్రమంలో డ్రగ్ మాఫియా అతని కుటుంబాన్ని, చెల్లెలిని అంతం చేస్తే, ఆధ్యాత్మిక నేపథ్యంలో ఆ మాఫియాను హీరో ఎలా తుదముట్టిస్తాడనే ఉత్కంఠభరితమైన కథాంశంతో సినిమా సాగుతుందని వివరించారు.
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వేదికపై ఫిలింనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పాటు వివిధ పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు మెమెంటోలు, గోల్డ్ మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. స్కాలర్ షూటింగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపింది.