గ్రామ పంచాయతీ, కందుకూరు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట పోలీస్ బందోబస్తు:
సూర్య స్టేట్ బ్యూరో.
ప్రకాశం జిల్లాలో జరగనున్న గ్రామ పంచాయతీ, కందుకూరు మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు శనివారం తెలిపారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నుంచి పోలింగ్, తదుపరి ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
జిల్లాలో మొత్తం 515 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనుండగా, మూడు విడతల్లో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. మొదటి విడతలో ఒంగోలు, కొండపి నియోజకవర్గాల పరిధిలోని 139 గ్రామ పంచాయతీలతో పాటు కందుకూరు మున్సిపాలిటీలోని 40 వార్డులకు, రెండో విడతలో అద్దంకి, దర్శి నియోజకవర్గాల పరిధిలోని 198 గ్రామ పంచాయతీలకు, మూడో విడతలో కందుకూరు, సంతనూతలపాడు నియోజకవర్గాల పరిధిలోని 178 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని 1,280 పోలింగ్ లొకేషన్ల పరిధిలో ఉన్న 5,236 పోలింగ్ కేంద్రాలను 808 సాధారణ, 275 సమస్యాత్మక, 197 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి అందుకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల బందోబస్తు కోసం సుమారు 1,400 మంది పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచామని తెలిపారు.
నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు కేవలం ఇద్దరు మాత్రమే అనుమతి ఉంటుందని, కేంద్రాల వద్ద ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించడం, గుంపులుగా రావడం, నినాదాలు చేయడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 163 BNSS అమలులో ఉన్నందున నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో నిబంధనలకు విరుద్ధంగా జనాలు గుమిగూడరాదన్నారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులపై ముందస్తు చర్యలు చేపట్టామని, ఎన్నికల బందోబస్తు కోసం 1,400 సిబ్బందిని అందుబాటులో ఉంచారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వారిపై ముందస్తు చర్యల్లో భాగంగా 739 మంది చెడు నడతగల వ్యక్తులను (రౌడీషీటర్ల), 3,411 మంది గొడవలు మరియు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ముందస్తుగా బైండోవర్ చేశామని, వారిపై నిఘా కొనసాగుతుందన్నారు.
నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణతో పాటు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను కూడా సిద్ధంగా ఉంచామన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం, బహుమతులు లేదా ఇతర వస్తువులు పంపిణీ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు పోలీసులకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.