బాపట్ల కలెక్టరేట్లో SAANS కార్యక్రమ బ్యానర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
బాపట్ల, మేజర్‌న్యూస్ :
చిన్నారుల్లో న్యుమోనియా వ్యాధి నివారణ, వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడం, సకాలంలో గుర్తించి సమర్థవంతమైన వైద్య చికిత్స అందించడం లక్ష్యంగా నిర్వహిస్తున్న SAANS (Social Awareness and Action to Neutralize Pneumonia Successfully) కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్‌ను గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ శ్రీ డాక్టర్ వినోద్ కుమార్ వి., IAS గారు బాపట్ల కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ SAANS అవగాహన కార్యక్రమం 2026 నవంబర్ 12వ తేదీ నుంచి 2027 ఫిబ్రవరి 28వ తేదీ వరకు నిర్వహించబడుతుంది. చిన్నారుల్లో న్యుమోనియా వ్యాధిని ముందుగానే గుర్తించడం, సకాలంలో నిర్ధారణ చేయడం, సమర్థవంతమైన చికిత్స అందించడం, వ్యాధి నివారణకు అవసరమైన జాగ్రత్తలపై తల్లిదండ్రులు మరియు ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం. తద్వారా న్యుమోనియా కారణంగా చిన్నారుల్లో కలిగే అనారోగ్యం, మరణాలను తగ్గించేందుకు కృషి చేయడం జరుగుతుంది.“Pneumonia Nahin, Toh Bachapan Sahi” అనే నినాదంతో ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. న్యుమోనియా నుంచి చిన్నారులను రక్షించడం, నివారణ చర్యలపై అవగాహన పెంపొందించడం, అవసరమైన సమయంలో వైద్య సేవలు అందించడం ద్వారా ప్రతి చిన్నారికి ఆరోగ్యకరమైన బాల్యాన్ని అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం. ఈ కార్యక్రమంలో గౌరవ DMHO డాక్టర్ ఎస్. విజయమ్మ గారు, DIO ఇన్చార్జ్ డాక్టర్ బి. మౌనిక గారు, వివిధ కార్యక్రమాల జిల్లా అధికారులు (Programme Officers) పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో చిన్నారుల న్యుమోనియా నివారణ, గుర్తింపు, చికిత్సా సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రతి చిన్నారికి మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కట్టుబడి ఉందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు.