వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి.. - సీఎస్ సంజయ్ జాజ్జు
సూర్య - పెద్దపల్లి: రాబోయే రబీ సీజన్‌లో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు కలెక్టర్లను ఆదేశించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి సాగుకు బదులుగా ఉద్యాన పంటలు, ఆయిల్‌పామ్, సూక్ష్మ సేద్య విధానాలను ప్రోత్సహించాలని సూచించారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయం, ధాన్యం కొనుగోళ్లు, విద్య, భూసేకరణ, వీధి కుక్కల నియంత్రణ, VBGRAMG పనులపై సమీక్షించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు కనీస మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్ అందేలా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును 90 శాతానికి పెంచాలని, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలని, గ్రామాల్లో నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వీధి కుక్కల నియంత్రణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చర్యలు చేపట్టాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ శ్రీరాములు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.