సంగోజివాడి, వంకాయపల్లి శివార్లలో భూముల రీ-సర్వేపై అవగాహన సదస్సు
సూర్య తాడ్వాయి :తాడ్వాయి మండలంలోని సంగోజివాడి వంకాయపల్లి శివార్లలో నిర్వహించనున్న భూముల రీ-సర్వే ప్రక్రియపై ఈరోజు ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. చిట్యాల మరియు సంగోజివాడి గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆవరణలో జరిగిన ఈ సమావేశాలకు స్థానిక రైతులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
తాడ్వాయి తహసీల్దార్ శ్వేత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే (DI సర్వే), స్థానిక సర్పంచులు, మండల సర్వేయర్లు, మండల గిర్దావర్ (RI) మరియు గ్రామ పాలనా అధికారులు (GPO) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, భూముల రికార్డుల ప్రక్షాళన మరియు హద్దుల వివాదాల శాశ్వత పరిష్కారం కోసమే ప్రభుత్వం రీ-సర్వే చేపడుతోందని వివరించారు. సర్వే సమయంలో రైతులు తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు, ఇతర యాజమాన్య పత్రాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. సర్వే బృందాలకు గ్రామ ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. అనంతరం రైతులు అడిగిన పలు సందేహాలను వివరించారు.