telanagana
రాజన్న క్షేత్రానికి 'కృష్ణశిల' వైభవం రావాలి
Telanagana
06 Oct 2026
26 views
సూర్య, వేములవాడ:తెలంగాణ ప్రజల హక్కుల రక్షణే ధ్యేయంగా 'తెలంగాణ రక్షణ సేన' పార్టీ ప్రజాక్షేత్రంలో రాజీలేని పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మంగళవారం వేములవాడ పుణ్యక్షేత్రానికి విచ్చేసిన ఆమె, భీమేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూ.250 కోట్లతో సాగుతున్న రాజన్న ఆలయ పునర్నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిలో జరుగుతున్న లోపాలు, వేములవాడను వేధిస్తున్న తీవ్రమైన మౌలిక సమస్యలపై ఆమె పాలకులను కడిగిపారేశారు.
కాంక్రీట్ వద్దు.. కృష్ణశిలతోనే శాశ్వత కట్టడాలు!
"రాజన్న ఆలయ విస్తరణ పనులను కాంక్రీట్‌తో కాకుండా, ఆగమశాస్త్ర నియమాలకు అనుగుణంగా కృష్ణశిలతో (రాతి కట్టడాలు) మాత్రమే శాశ్వత నిర్మాణాలుగా చేపట్టాలి" అని కవిత గట్టిగా డిమాండ్ చేశారు. భక్తులు భక్తితో సమర్పించే కోడెల సంరక్షణ విషయంలో ఆలయ అధికారులు ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. మూగజీవాలకు కనీసం పశుగ్రాసం, తాగునీరు అందించకపోవడం దారుణమన్న ఆమె, చనిపోతున్న కోడెలకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు.
స్థానిక సమస్యలపై కవిత సమరశంఖం
వేములవాడ పట్టణాన్ని పట్టిపీడిస్తున్న మూడు ప్రధాన సమస్యలపై కవిత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు:
• గుడి చెరువు దుర్గంధం:
లక్షలాది మంది భక్తులు వచ్చే పవిత్ర పుణ్యక్షేత్రంలో గుడి చెరువు దుర్గంధం వెదజల్లడం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని, దీనిని తక్షణమే ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.
• అండర్ గ్రౌండ్ డ్రైనేజీ:
ఇంతటి ప్రసిద్ధ పట్టణంలో నేటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంపై ఆమె తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, తక్షణమే పనులు ప్రారంభించాలన్నారు.
రూ.5 కోట్ల ప్రజాధనం వృథా
ఐదు కోట్ల వ్యయంతో నిర్మించిన కూరగాయలు, మాంసం మార్కెట్లను ఓపెన్ చేయకుండా నిరుపయోగంగా ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని వెంటనే స్థానిక వ్యాపారులకు అందుబాటులోకి తేవాలన్నారు.
చేనేత ‘యార్న్’ రాజకీయం.. సాగునీటి నిర్లక్ష్యం
చేనేత కార్మికులు అత్యధికంగా ఉన్న సిరిసిల్ల ప్రాంతానికి కేటాయించాల్సిన యార్న్ డిపోను రాజకీయ కారణాలతో వేములవాడకు తరలించడంపై కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ అధికారం ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదన్నారు. అలాగే రుద్రంగి వద్ద 0.5 టీఎంసీల రిజర్వాయర్, కాలువల పనులను పూర్తి చేసి 63 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నారు. దుంపేట నుంచి లిఫ్ట్ ఏర్పాటు చేసి సనుగుల చెరువులను అనుసంధానిస్తే.. వేములవాడ, కోనరావుపేట, చందుర్తి మండలాల రైతులకు సాగునీటి కష్టాలు తీరుతాయని హితవు పలికారు.
కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు.. ప్రత్యామ్నాయం వైపు ప్రజలు!
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పూర్తిగా సన్నగిల్లిందని, రేవంత్‌రెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. గతంలో కేటీఆర్ మంత్రిగా, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నా ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజలు ఇప్పుడు కొత్త శక్తుల వైపు చూస్తున్నారని, తెలంగాణ రక్షణ సేనను బలోపేతం చేసి ప్రజా సమస్యలపై పోరాడుతామన్నారు. ఒకప్పుడు ప్రజా ఉద్యమాల్లో (మావోయిస్టులు) పనిచేసిన వారు జనజీవన స్రవంతిలోకి వచ్చి, తమ పార్టీ ద్వారా ప్రజాసేవ చేయాలని కవిత పిలుపునిచ్చారు.
ట్యాగ్లు:
Latest News