సోషల్ మీడియా కోసం.... ప్రాణాలతో చెలగాటం...
ఆకతాయి బాలురను గుర్తించిన సూర్యాపేట ట్రాఫిక్ పోలీసులు
శిక్ష కాదు.. సరిదిద్దే ప్రయత్నం! మానవతా దృక్పథంతో కౌన్సెలింగ్
మొదటి తప్పిదంగా భావించి హెచ్చరించిన పోలీసులు.. మరోసారి చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్
సూర్యాపేట క్రైమ్ మేజర్ న్యూస్
బైక్‌పై ప్రమాదకరంగా అసభ్యకరంగా కూర్చొని డ్రైవింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేసిన బాలురను సూర్యాపేట ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. యువతలో కొందరు చేస్తున్న ఇలాంటి ఆకతాయి చేష్టలు తమకే కాకుండా రహదారిపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఎస్పీ ఆదేశాల మేరకు టౌన్ సీఐ వెంకటయ్య ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్‌ఐ యాదవేందర్ రెడ్డి కానిస్టేబుళ్లు సంతోష్ కుమార్ వెంకట్ రెడ్డి బాలురను గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.
అయితే కేవలం శిక్షించడం కాకుండా బాలుర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. రహదారులపై ప్రమాదకరంగా బైక్ నడపడం, సోషల్ మీడియాలో లైక్స్ వ్యూస్ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో వారికి వివరించారు.
తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సమాజం తమపై పెట్టుకున్న నమ్మకాన్ని గుర్తు చేస్తూ.. చిన్న వయసులో చేసే సరదా చేష్టలు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని పోలీసులు హెచ్చరించారు. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా మెలగాలని సూచించారు.
“ఇది మొదటి తప్పిదంగా భావించి మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అవకాశం ఇస్తున్నాం. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అంటూ పోలీసులు బాలురకు స్పష్టంగా హెచ్చరిక జారీ చేశారు.