ఐవీఎఫ్ అండాల దందాలో కేటీఆర్ పాత్రపై విచారణ జరపాలి: ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ ఆరోపణ
సూర్య బ్యూరో ప్రతినిధి : రాష్ట్రంలో వెలుగుచూసిన మహిళల అండాల విక్రయాల వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాత్రపై విచారణ జరపాలని ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కేటీఆర్ బాల్యమిత్రుడు గేదెల వెంకట సూర్యకిరణ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారని, సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ సంస్థతో కేటీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధాలున్నాయని ఆరోపించారు. సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కేటీఆర్ భార్య కల్వకుంట్ల శైలిమ డైరెక్టర్‌గా, వాటాదారుగా ఉన్నారని వెంకట్ పేర్కొన్నారు. మహిళలను ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి డబ్బు ఆశ చూపి అండాల సేకరణ, విక్రయాల దందా సాగించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సంస్థకు గత ప్రభుత్వం సుల్తాన్‌పూర్‌లో భూములు కేటాయించిందని కూడా పేర్కొన్నారు. గేదెల వెంకట సూర్యకిరణ్‌తో కేటీఆర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని, నిందితులకు అండగా కేటీఆర్ లీగల్ టీమ్ పనిచేస్తోందని వెంకట్ విమర్శించారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు, హైకోర్టు పరిణామాలను ప్రస్తావిస్తూ, మహిళల అండాలతో వ్యాపారం చేయడం అమానవీయమని అన్నారు. ఈ వ్యవహారంపై కేటీఆర్ స్పందించాలని, తన ఆరోపణలకు సమాధానం చెప్పాలని బల్మూర్ వెంకట్ డిమాండ్ చేశారు. అండాల విక్రయాల కేసులో సంబంధిత వ్యక్తుల పాత్రపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరారు.