మోడల్ స్కూల్‌లో విద్యుత్ షాక్‌తో విద్యార్థికి తీవ్ర గాయాలు
పూడూరు, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం ఎన్కేపల్లి మోడల్ స్కూల్‌లో 11 రోజుల క్రితం ఓ విద్యార్థి విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. పాఠశాల ఆవరణలోని ఆటస్థలంలో ఉన్న చెట్టుకు విద్యుత్ తీగలు కట్టడంతో, విద్యార్థులు ఆటలాడుతూ చెట్టును తాకగా విద్యుత్ షాక్ తగిలినట్లు ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ విద్యార్థి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే ఇంతటి ఘటన జరిగినప్పటికీ పాఠశాల ప్రిన్సిపాల్ ఈ విషయాన్ని బయటకు రాకుండా దాచిపెట్టారని, విద్యాశాఖ అధికారులు సైతం పట్టించుకోలేదని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు తేజ విమర్శించారు. విద్యార్థి ప్రాణాలకు ముప్పు కలిగేలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత విద్యార్థికి ప్రభుత్వం రూ.10 లక్షల నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు విష్ణు, దీపక్, సాత్విక్, ఎన్ఎస్‌యూఐ నాయకుడు సైఫ్ తదితరులు పాల్గొన్నారు.