సీసీ కెమెరాల నిఘా నీడలో ముడుమాల్ : ఎస్సై ఎస్ఎం. నవీద్
కృష్ణ సూర్య న్యూస్ :
ప్రజల భద్రత, నేరాల నియంత్రణే పరమావధిగా మండల పరిధిలోని ముడుమాల్ గ్రామం ఇప్పుడు పూర్తిస్థాయి నిఘా నీడలోకి వచ్చింది. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం రూ.1,40,000 వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన 6 అధునాతన సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను మంగళవారం స్థానిక ఎస్సై ఎస్ఎం. నవీద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు గ్రామ పెద్దల సహకారంతో కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై నవీద్ మాట్లాడుతూ... గ్రామంలోని ప్రధాన రహదారులు, అత్యంత కీలకమైన ప్రాంతాలు, ప్రవేశ-నిష్క్రమణ మార్గాల్లో ఈ కెమెరాలను అమర్చామని తెలిపారు. వీటి ద్వారా 24/7 నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. "సీసీ కెమెరాలు కేవలం నేరాలు జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడానికే కాకుండా, నేరాలను ముందస్తుగా అడ్డుకోవడానికి డిజిటల్ సైనికుల్లా పనిచేస్తాయి" అని ఆయన పేర్కొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఎస్సై పిలుపునిచ్చారు. "నేను సైతం – నా గ్రామ భద్రత కోసం సీసీ కెమెరా" అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, పరిసర మండలాల ప్రజలు కూడా దీనిని ఆదర్శంగా తీసుకోవాలని ఎస్సై సూచించారు. గ్రామంలో భద్రతా వాతావరణం కల్పించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఎస్సై ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ విపీఓ సురేందర్ బాబు, సర్పంచ్ బాలరాజు, ఉప సర్పంచ్ రంగమ్మ ,వెంకటేష్ గ్రామ పెద్దలు తమ్మప్ప, రాఘవేందర్ గౌడ్, దండు రాఘవేంద్ర, బీటీఎం తిమ్మప్ప, భీమా శంకర్ తదితరులు పాల్గొన్నారు.
నర్సిములు, సూర్య రిపోర్టర్ కృష్ణ మండలం