విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం
సూర్య న్యూఢిల్లీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'విజయవాడ ఉత్సవ్ 2.0'తో పాటు ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరిగే శరన్నవరాత్రి దసరా మహోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆహ్వానం అందింది. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా విజయవాడ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పేలా అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్న విజయవాడ ఉత్సవ్ 2.0 ప్రత్యేకతలు, ఏర్పాట్లను కేంద్ర మంత్రికి వివరించారు. దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ నగరానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు తరలిరానున్న నేపథ్యంలో పున్నమి ఘాట్, మాకినేని బసవపున్నయ్య స్టేడియం తదితర వేదికల్లో భారీ సాంస్కృతిక ప్రదర్శనలు, కార్నివాల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు విచ్చేయాలని కోరగా.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు నేతలు పేర్కొన్నారు.
అలాగే రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని మౌలిక వసతుల విస్తరణ మరియు దసరా ఉత్సవాల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడపడంపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. విజయవాడను పర్యాటక, వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తోందని నేతలు స్పష్టం చేశారు.