సూర్య వార్తకు స్పందన.. చవటపల్లి ముందర సర్వీస్ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసిన ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు
పూతలపట్టు మేజర్ న్యూస్:
బెంగుళూరు - నాయుడుపేట జాతీయ రహదారిని ఆనుకుని పి. కొత్త కోట పంచాయతీ పరిధిలోని చవటపల్లి ముందర ఉన్న సర్వీస్ రోడ్డుపై వాహనాల అతివేగాన్ని అరికట్టేందుకు ఎట్టకేలకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు స్పందించారు. ' సూర్య' దినపత్రికలో ప్రచురితమైన వార్తకు అధికారులు కదిలి, గ్రామస్థుల చిరకాల కోరిక మేరకు చవటపల్లి ముందర సర్వీస్ రోడ్డుపై ప్రమాదకరంగా మారిన ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్ను నిర్మించారు అంతేకాకుండా వాహనదారులకు దూరం నుంచే స్పష్టంగా కనిపించేలా పసుపు, తెలుపు రంగులతో మార్కింగ్ పనులను పూర్తి చేశారు గత కొంతకాలంగా చవటపల్లి ముందర ఈ సర్వీస్ రోడ్డుపై కార్లు, ఇతర వాహనాలు అత్యంత వేగంతో దూసుకెళ్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యేవారు ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు, మహిళలు రోడ్డు దాటాలంటేనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది వేగ నియంత్రణ చర్యలు లేకపోవడంతో ఇప్పటికే పలుమార్లు చిన్నపాటి ప్రమాదాలు చోటుచేసుకోవడమే కాకుండా, పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు ఈ సమస్యపై 'సూర్య' పత్రికలో వచ్చిన కథనం, స్థానికుల విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సానుకూలంగా స్పందించిన ఎన్.హెచ్ అధికారులు ప్రత్యేక సిబ్బందిని, రోడ్డు నిర్మాణ వాహనాలను రంగంలోకి దించారు. ఎన్.హెచ్.ఏ.ఐ సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షిస్తూ, రోడ్డు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా స్పీడ్ బ్రేకర్ నిర్మాణ పనులను చేపట్టారు. నిర్మాణం పూర్తయిన వెంటనే, పగలు, రాత్రి వేళల్లో సైతం వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా ఆకర్షణీయంగా పసుపు, తెలుపు రంగులతో చారలు వేయించారు ప్రస్తుతం చవటపల్లి ముందర స్పీడ్ బ్రేకర్ ఏర్పాటుతో సర్వీస్ రోడ్డుపై వెళ్లే కార్లు, ఇతర వాహనాల వేగం గణనీయంగా తగ్గిందని, వాహనదారులు నెమ్మదిగా ప్రయాణిస్తున్నారని చవటపల్లి గ్రామస్థులు, ప్రయాణికులు,స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమ సమస్యను వార్త రూపంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లిన 'సూర్య' పత్రికకు, అలాగే తక్షణమే స్పందించి పనులు పూర్తి చేసిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులకు, సిబ్బందికి చవటపల్లి గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చర్యతో ఇకపై చవటపల్లి ముందర రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పూతలపట్టు రిపోర్టర్ దిలీప్ కుమార్