సాంబన్న క్యాంపు కార్యాలయంలో ఏకగ్రీవ సంబరం
పర్చూరు, మేజర్‌న్యూస్ :
పర్చూరు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవ విజయోత్సాహం వెల్లివిరిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా సాంబన్న మార్క్ ఏకగ్రీవాల జోరు కొనసాగింది. ఆదివారం ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయం పసుపు పండుగను తలపించింది. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును కలిసేందుకు తరలిరావడంతో క్యాంపు కార్యాలయం సందడిగా మారింది. నూతన ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే ఏలూరి శాలువాలు కప్పి ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నినాదాలతో కార్యాలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. ఏకగ్రీవ విజయానికి సహకరించిన ఎమ్మెల్యే ఏలూరికి సర్పంచులు, వార్డు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ.. ప్రజల నమ్మకమే ఏకగ్రీవ విజయాలకు పునాది అని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థాయి శ్రేణులు సమష్టిగా పనిచేయడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. పంచాయతీలకు పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు రాజకీయాలకు అతీతంగా గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, అంతర్గత రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏకగ్రీవ విజయాలతో పాటు ఎన్నికలు జరగనున్న అన్ని పంచాయతీల్లోనూ పసుపు జెండా ఎగరాలని ఎమ్మెల్యే ఏలూరి ఆకాంక్షించారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ పార్టీ విజయపరంపరను కొనసాగించాలని పిలుపునిచ్చారు.