రాంగ్ రూట్‌లో వచ్చిన బైక్ ఢీకొని వ్యక్తి మృతి
రాంగ్ రూట్‌లో వచ్చిన బైక్ ఢీకొని వ్యక్తి మృతి
-భార్యకు తీవ్ర గాయాలు.. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
-రూరల్ ఎస్సై నవత
సిద్దిపేట రూరల్ :రాంగ్ రూట్‌లో వచ్చిన పల్సర్ బైక్ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందగా,ఆయన భార్య గాయపడింది.ఆదివారం మండల పరిధిలోని చిన్నగుండవెల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. సిద్దిపేట రూరల్ ఎస్సై డి.నవత తెలిపిన వివరాల ప్రకారం.... దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన చిలుకోటి మల్లారెడ్డి (58), తన భార్య ఇంద్ర (55)తో కలిసి ఆదివారం ఉదయం 11 గంటలకు ద్విచక్ర వాహనంపై సిద్దిపేటలో నివసిస్తున్న తమ చిన్న కుమార్తె ఇంటికి బయలుదేరారు. ఉదయం 11.15 గంటల సమయంలో చిన్నగుండవెల్లి గ్రామ శివారులోని వెంకటేశ్వర సిమెంట్ బ్రిక్స్ అండ్ టైల్స్ కంపెనీ సమీపానికి చేరుకోగానే, సిద్దిపేట నుంచి దుబ్బాక వైపు వెళ్తున్న పల్సర్ బైక్ ఎదురుగా రాంగ్ రూట్‌లో అతివేగంగా వచ్చి వారి వాహనాన్ని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో మల్లారెడ్డికి తల ఎడమవైపు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన భార్య ఇంద్రకు తల, ఛాతీ భాగాల్లో గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మల్లారెడ్డి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడి చిన్న కుమార్తె దామరపల్లి సంధ్యారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవత వెల్లడించారు.
(సూర్య రూరల్, రమేష్)