ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ వైఫల్యం
*--మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి,మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి.*
నవాబుపేట సూర్య న్యూస్:ధాన్యం కొనుగోళ్ల పేరుతో ఉత్తుత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి,మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.ఆదివారం మండల పరిధిలోని గురుకుంట గ్రామంలో వారు విలేకరులతో మాట్లాడుతూ..ఖరీఫ్ సాగులో రైతులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, మరోవైపు చేతికొచ్చిన ధాన్యాన్ని సైతం సకాలంలో విక్రయించుకోలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24గంటల విద్యుత్ సరఫరాతో పాటు ప్రాజెక్టుల నిర్మాణం,రైతుబంధు,రైతుబీమా వంటి పథకాల ద్వారా అండగా నిలిచామని తెలిపారు.రైతులు దళారుల బారిన పడకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర అందించామని గుర్తు చేశారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల సమస్యలను పట్టించుకోకుండా వారిని గాలికి వదిలేసిందని విమర్శించారు.మహబూబ్‌నగర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి,నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించడంతో పాటు అన్ని విధాలా ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రైతుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు నర్సింలు,మాజీ ఎంపీపీ అనంతయ్య,నాయకులు నాగిరెడ్డి,ప్రతాప్,చెన్నయ్య,యాదయ్య,అబ్దుల్లా,గాండ్ల రవి,శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.