జోగింపేట గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించిన ఏవో ఎస్ అవినాష్
సీతానగరం: ఆత్మ వారి సౌజన్యం తో మండలంలో జోగింపేట గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంతో పాటు నేల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను సాధించేందుకు రైతులు సేంద్రియ ఎరువులు, జీవ ఎరువులు మరియు జీవ నియంత్రణ పద్ధతులను వినియోగించాలని మండల వ్యవసాయ అధికారి ఎస్ అవినాష్ రైతులకు సూచించారు.
వరి సాగులో సేంద్రీయ పద్ధతులను అవలంబిస్తున్న రైతులు మైసూరు మల్లికా రకాన్ని సాగు చేసుకోవచ్చని . ఈ రకాన్ని గ్రామంలో మార్రపు సుబ్బినాయిడు పొలంలో సాగులో ఉంది అని తెలిపారు.ఈ రకాన్ని స్థానిక నేల, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు చేస్తూ సిఫార్సు చేసిన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా మంచి పంటను పొందే అవకాశం ఉందన్నారు. మైసూరు మల్లికా వరి రకంలో పంటకు అవసరమైన పోషకాలను అందించేందుకు పశువుల ఎరువు, కంపోస్టు, వర్మీకంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు మరియు జీవ ఎరువులను వినియోగించాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచడం ద్వారా నేల భౌతిక, రసాయన మరియు జీవ లక్షణాలను మెరుగుపరచవచ్చని తెలిపారు. పంటలో చీడపీడల నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలని, అవసరమైన సందర్భాల్లో వేప ఆధారిత సేంద్రియ ద్రావణాలు, జీవ నియంత్రణ కారకాలు వినియోగించాలని అధికారులు సూచించారు. కలుపు నివారణకు యాంత్రిక పద్ధతులను అవలంబిస్తూ, నీటి యాజమాన్యాన్ని సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. సేంద్రీయ వరి సాగులో పంట అవశేషాలను పొలంలోనే సేంద్రియ పదార్థంగా వినియోగించడం, పంట మార్పిడి చేపట్టడం, జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం వంటి పద్ధతులను పాటించడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. మైసూరు మల్లికా రకాన్ని సాగు చేసే రైతులు నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకొని, విత్తన శుద్ధి, సేంద్రియ పోషక యాజమాన్యం, నీటి యాజమాన్యం మరియు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను శాస్త్రీయంగా పాటించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను మరింత విస్తరించేందుకు రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాలను వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు.