నో అబ్జక్షన్ సర్టిఫికెట్ల జారీకి సింగిల్ విండో ఏర్పాటు చేయాలి
- ప్రతి నాలుగు వార్డులకు ఒకచోట సౌకర్యం కల్పించాలి
- నిర్దిష్ట కాలపరిమితిలో సర్టిఫికెట్లు జారీ చేయాలి
- మదనపల్లె వైకాపా ఇంచార్జ్ ఎస్.నిసార్ అహ్మద్
మదనపల్లె : త్వరలో జరుగనున్న మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు అవసరమైన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు,నో డ్యూ సర్టిఫికెట్లు పొందేందుకు సంబంధిత మునిసిపల్,పోలీస్ శాఖలకు దరఖాస్తు చేసుకుంటున్నారని,అయితే సర్టిఫికెట్ల జారీ విషయంలో అధికారులు జాప్యం చేస్తున్నారనే విషయాన్ని పలువురు అభ్యర్థులు తమ దృష్టికి తీసుకొచ్చారని,ఈ నేపథ్యంలో అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా,ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రతి నాలుగు మునిసిపల్ వార్డులకు ఒక వార్డు సచివాలయంలో సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేసి,మునిసిపల్ మరియు పోలీస్ శాఖలకు సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లు,నో డ్యూ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులను అక్కడే స్వీకరించి,సంబంధిత శాఖల సమన్వయంతో త్వరితగతిన జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్.నిసార్ అహ్మద్ జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మను కోరారు.ఈ మేరకు మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టరుని కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ అభ్యర్థులు వివిధ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకే కేంద్రంలో దరఖాస్తులు సమర్పించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలని,ప్రతి దరఖాస్తుకు నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయించి,ఆ గడువులోగా నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్స్,నో డ్యూ సర్టిఫికెట్లు జారీ అయ్యేలా సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.మునిసిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో సమయం కీలకమైనందున,సర్టిఫికెట్ల జారీ ఆలస్యం వల్ల ఏ అభ్యర్థికీ ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.అనంతరం మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నాలుగు వార్డులకు ఒక సింగిల్ విండో - నిర్దిష్ట గడువులో సర్టిఫికెట్లు అనే విధానం అమలు చేస్తే అభ్యర్థులకు సౌలభ్యం కలగడంతోపాటు,మునిసిపల్ మరియు పోలీస్ శాఖల మధ్య సమన్వయం మెరుగుపడి ప్రక్రియలో పారదర్శకత,జవాబుదారీతనం పెరుగుతుందన్నారు.జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఈ అంశాన్ని పరిశీలించి,సంబంధిత అధికారులతో సమన్వయం చేసి తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఈశ్వర్ నాయక్,యూనస్,మాధవ రెడ్డి,నూర్ మొహియుద్దీన్ ఖాన్,ఎన్.నవాజ్ అలీ ఖాన్,అనిల్ కుమార్ రెడ్డి,సాంబశివారెడ్డి,ఆవుల సోమశేఖర్ రెడ్డి,చరణ్,నాగమణి,షేక్ జబి,యాసిన్,రియాజ్,అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.