telangana
ఎలినో కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – ఆర్మూర్ సబ్ కలెక్టర్‌కు ఏఐయూకేఎస్ నాయకుల వినతి
సూర్య, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎలినో ప్రభావంతో ఏర్పడుతున్న కరువు పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐయూకేఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు యు.రాజన్న, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు బి.కిషన్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.వరి సాగు వద్దంటూ వ్యవసాయ అధికారులతో ప్రచారం చేయించడం, రైతుల నుంచి వ్యక్తిగత హామీ పత్రాలు తీసుకోవడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. డ్రిప్‌లైన్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు 15 రోజుల్లో పూర్తి సబ్సిడీతో మంజూరు చేయాలని, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, శనగ, ఉలవలు తదితర పంటల విత్తనాలను ఉచితంగా అందించాలని కోరారు. విత్తనాలు వేసే యంత్రాలు, వ్యవసాయ పరికరాలు, పిచికారీ పంపులు, డ్రోన్లను సబ్సిడీపై అందించాలని విజ్ఞప్తి చేశారు.అడవి జంతువుల నుంచి పంటలను రక్షించేందుకు సోలార్ ఫెన్సింగ్‌కు 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని, బోరుబావులకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేస్తున్న ధరకు అనుగుణంగా ప్రభుత్వం వరి ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.3,400 చొప్పున కొనుగోలు చేయాలని, రుణమాఫీతోపాటు బ్యాంకుల ద్వారా కొత్త రుణాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు.పాడి పరిశ్రమ అభివృద్ధికి పశుగ్రాసం, దాణాను సబ్సిడీపై అందించాలని, పాడి పశువులకు ఉచిత బీమా కల్పించాలని కోరారు. పశువుల కొనుగోలు, సంరక్షణ, పశుగ్రాస సరఫరా కోసం బైక్ ట్రాలీలు, గడ్డి కోత యంత్రాలకు ఐదు లక్షల యూనిట్ల వరకు సబ్సిడీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు స్పందించకపోతే రైతాంగాన్ని ఏకం చేసి ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐయూకేఎస్ జిల్లా కార్యదర్శి ఎ.పి.గంగారం, ఏరియా నాయకులు లింబాద్రి, నాగన్న, కే.గంగారం, యం.చిన్నయ్య, సీహెచ్.గంగారం, సీహెచ్.లక్ష్మణ్, ఎం.జగదీశ్వర్, మల్కన్న తదితరులు పాల్గొన్నారు.