అర్హులందరికీ బీమా రక్షణ కల్పించడమే లక్ష్యం ...ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు
సూర్య నస్పూర్ :అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా రక్షణ కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు అన్నారు. సోమవారం ఆర్కే-8 కాలనీ డిస్పెన్సరీ సమీపంలోని అంబేద్కర్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కార్యక్రమంలో మేయర్ ధరణి మధుకర్, స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ఈ పథకం అండగా నిలుస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకుని పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రిటైర్డ్ సింగరేణి కార్మికులకూ రేషన్ కార్డులు..
నస్పూర్, శ్రీరాంపూర్ ప్రాంతాల్లో నివసిస్తున్న రిటైర్డ్ సింగరేణి కార్మికులకు సైతం తెల్ల రేషన్ కార్డులు మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. దీంతో వారు కూడా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి అర్హులయ్యారని పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు 4 వేల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందించామని, సింగరేణి స్థలాల్లో 45 ఏళ్లుగా నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఒక్కటే మిగిలిందని, ఆ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని, మెడికల్ బోర్డుల నిర్వహణ, డిస్మిస్ అయిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం, మారుపేర్ల సమస్య పరిష్కారం వంటి అంశాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సింగరేణి స్థలాలను పరిశీలించి కార్మికులకు మెరుగైన లేఅవుట్లలో ప్లాట్లు కేటాయించేలా చూస్తానన్నారు.
అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు
- నగర మేయర్ ధరణి మధుకర్
మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కొందరు అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై పథకాల ద్వారా లబ్ధి పొందడం ఇష్టం లేకనే కొందరు పార్టీకి సంబంధం లేని వ్యక్తులు అడ్డుపడుతున్నారని అన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, 2028 డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో ప్రజల మద్దతు మరోసారి ప్రేమ్‌సాగర్ రావుకే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వేల్పుల రవీందర్,పత్తి ప్రకృతి వెంకటేష్, రాచకొండ గోపాలరావు, ఎంబడి కుమారస్వామి, బండారి సుధాకర్, గుమ్మడి శ్రీనివాస్, తోట రాజేశ్వరి, వనపర్తి కేత, మేకల రాము, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, అసిస్టెంట్ కమిషనర్ రాజు, ఏసీపీ ప్రకాష్, ఎస్సై తాహసీన్‌ఉద్దీన్, కోఆప్షన్ సభ్యుడు సంతోష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.