రైల్వే బ్రిడ్జిపై నుంచి పడి వ్యక్తి మృతి
సూర్య,మాక్లూర్ :మద్యం మత్తులో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి రైల్వే బ్రిడ్జిపై నుంచి కిందపడి మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మాక్లూర్ మండలంలోని ఓడ్యట్ పల్లి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.ఎస్ఐ అనిల్ రెడ్డీ తెలిపిన వివరాల ప్రకారం..ఓడ్యట్ పల్లి గ్రామానికి చెందిన ఇండ్ల శిమయ్య (34) తన భార్య జ్యోతితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చిన శిమయ్య, కొద్దిసేపటికే బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన భార్య బంధువులతో కలిసి అతడి కోసం గాలించింది.ఈ క్రమంలో శిమయ్య బంధువు చిన్నయ్యను సంప్రదించగా, ఇద్దరూ కలిసి రైల్వే ట్రాక్ పక్కన నడుచుకుంటూ వస్తుండగా ప్రమాదవశాత్తు రాళ్లపై కాలు జారి సుమారు 30 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి నుంచి కిందపడినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో శిమయ్య తలకు, ముఖానికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నయ్య నడుము భాగంలో తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు.సోమవారం స్పృహలోకి వచ్చిన చిన్నయ్య జరిగిన విషయాన్ని వివరించడంతో శిమయ్య భార్య జ్యోతి ఘటనా స్థలాన్ని పరిశీలించింది. అనంతరం ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ అనిల్ రెడ్డీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.