ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు కౌన్ బనేగా లక్పతి క్విజ్ పోటీలు
నారాయణపేట, సూర్యన్యూస్:
ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు కౌన్ బనేగా లక్పతి పేరుతో జిల్లా స్థాయి క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్.ప్రభాకర్ తెలిపారు. పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను సోమవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో గోవిందరాజు చేతులమీదుగా విడుదల చేయించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. పోటీలను రెండు విభాగాలుగా నిర్వహిస్తున్నామని 5, 6, 7 తరగతులకు జూనియర్ విభాగముగాను, 8, 9, 10వ తరగతుల వారికి సీనియర్స్ గాను పోటీ జరుగుతుందన్నారు. ముందుగా ప్రిలిమినరీ, తర్వాత సెమీ ఫైనల్ రాత పరీక్ష రూపంలో 100 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ రూపంలో, 2గంటల్లో రాయాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత ఫైనల్ (ఎంపికైన 10 మందికి) నేరుగా ప్రశ్నలు అడుగుతారని చెప్పారు. పరీక్ష నవంబర్ 22న జరుగుతుందని, కోస్గి, నారాయణపేట, మక్తల్ లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పాఠ్యపుస్తల్లోని సిలబస్ తో పాటు జికే, కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఉంటాయన్నారు. మండల స్థాయిలో టాపర్ కు రూ. 5వేలు, జిల్లా స్థాయిలో జూనియర్స్ కు ప్రథమ రూ.20వేలు, ద్వితీయ రూ.10వేలు ఇస్తామని, సీనియర్స్ కు ప్రథమ రూ.లక్ష, ద్వితీయ రూ.25వేలు, తృతీయ రూ.10వేలు నగదు బహుమతి లభిస్తుందన్నారు. జిల్లాలోని ప్రతి ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు అర్హులని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కే.రాఘవేంద్ర గౌడ్, మండల అధ్యక్షులు లాలూ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బసుదే రమేష్, వాగ్దేవి లాలప్ప, నందకుమార్, సిరిగిరి అనిల్ పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.