పట్టభద్రుల తీర్పు.. యువత భవిష్యత్తుకు మలుపు:డా. చినుకని శివ ప్రసాద్
చౌటుప్పల : ఒక్క ఓటు.. ఓ ఎమ్మెల్సీని మాత్రమే ఎన్నుకోదు. వేలాది మంది యువత ఆశలకు దిశ చూపుతుంది.. వారి భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైనవని సహస్ర ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా. చినుకని శివ ప్రసాద్ అన్నారు. నిరుద్యోగం, ఉద్యోగ నియామకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉన్నత విద్య, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలపై స్పష్టమైన కార్యాచరణ ఉన్న నాయకత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపిస్తూ.. వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడే వ్యక్తికే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కులం, ప్రాంతం, వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా విద్య.. ఉద్యోగం.. యువత భవిష్యత్తే ప్రధాన ఎజెండాగా ఓటు వేయాలని సూచించారు. ప్రతి పట్టభద్రుడు అభ్యర్థుల విధానం, నిబద్ధత, గత పనితీరును పరిశీలించి ఆలోచించి ఓటు వేయాలని కోరారు.