రాజ్‌కుమార్ సేవా స్ఫూర్తి చిరస్మరణీయం : ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
యువత, విద్యార్థులు ప్రమాదాలకు దూరంగా ఉండాలి
విజయవాడ సెంట్రల్, మేజర్ న్యూస్ : రాజ్‌కుమార్ సేవా స్ఫూర్తి చిరస్మరణీయమని, ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. 63వ డివిజన్ ఉడా కాలనీ మెయిన్‌రోడ్డులో ఆర్‌కే ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ వట్టే వెంకటేశ్వరరావు కుమారుడు వట్టే రాజ్‌కుమార్ జ్ఞాపకార్థం నిర్వహించిన సేవా కార్యక్రమంలో 300 మంది పేద విద్యార్థులకు పుస్తకాలు, పండ్లు, విద్యా సామగ్రిని ఎమ్మెల్యే పంపిణీ చేశారు. చిన్న వయసులోనే రాజ్‌కుమార్‌ను కోల్పోవడం బాధాకరమని, ఆయన జ్ఞాపకాలను సేవా కార్యక్రమాల రూపంలో కొనసాగిస్తూ పేద విద్యార్థులకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. రాజ్‌కుమార్ పేరుతో 63వ డివిజన్‌లో పార్కును ఏర్పాటు చేసి, ఆట వస్తువులు, ఇతర సౌకర్యాలను సొంత ఖర్చులతో కల్పిస్తున్న వట్టే వెంకటేశ్వరరావు కుటుంబాన్ని అభినందించారు. యువత తమ భవిష్యత్తుపై దృష్టి సారించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా ముందుకు సాగాలని, రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విద్య, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, సమాజ సేవపై దృష్టి పెట్టాలని కోరారు. కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, వట్టే చందు, మాజీ కార్పొరేటర్ పైడి తులసి, డివిజన్ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం, ప్రధాన కార్యదర్శి కోలా శ్రీను తదితరులు పాల్గొన్నారు.
✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ.