BREAKING
తిరువూరుకు ఎమ్మెల్యే కొలికపూడి దూరం.. రెండు నెలలుగా నియోజకవర్గానికి దూరంగా నేటి రాశి ఫలాలు25 నవంబర్, 2026 నేటి పంచాంగం25 నవంబర్, 2026 తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్ 40 ఏళ్ల ప్రజాసేవకు ప్రత్యక్ష రాజకీయ అడుగు ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన కానూరు, పోరంకిలో వంగవీటి రాధాకృష్ణ, బోడే ప్రసాద్ విస్తృత ప్రచారం

తిరువూరుకు ఎమ్మెల్యే కొలికపూడి దూరం.. రెండు నెలలుగా నియోజకవర్గానికి దూరంగా

Select Suryaa Now
తిరువూరుకు ఎమ్మెల్యే కొలికపూడి దూరం.. రెండు నెలలుగా నియోజకవర్గానికి దూరంగా

విజయవాడ: తిరువూరు మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి నిర్ణయాన్ని వ్యతిరేకించి సొంత ప్యానల్‌ను బరిలోకి దింపేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. గత రెండు నెలలుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్‌ ఎన్నికల సమయంలో మొదలైన విభేదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కూటమి ఒప్పందంలో భాగంగా తిరువూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని జనసేనకు కేటాయించారు. అధిష్టానం ఈ పదవికి పసుపులేటి మాధవిని ఎంపిక చేయగా, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మద్దతుతో పెనుమల్లి శ్రావణి పోటీకి దిగారు. అంతేకాకుండా ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారికి కౌన్సిలర్‌ స్థానాల్లోనూ అవకాశం దక్కకపోవడంతో ఆయన అసంతృప్తికి గురైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యే దూరంగా ఉన్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత కూడా తిరువూరుకు రాకపోవడం, సోమవారం నిర్వహించిన నూతన మున్సిపల్‌ కౌన్సిలర్ల అభినందన సభకు హాజరుకాకపోవడం పార్టీ శ్రేణుల్లో విస్మయాన్ని కలిగించింది. మధ్యలో ఒకసారి ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ, ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు కూడా ఎమ్మెల్యే హాజరుకాకపోవడం నియోజకవర్గంలో చర్చకు దారితీసింది.

హామీలిచ్చిన అభివృద్ధి పనులు ఎక్కడ?

మున్సిపల్‌ ఎన్నికలకు ముందు తిరువూరు పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే పలు హామీలు ఇచ్చారు. ఫ్యాక్టరీ సెంటర్‌ నుంచి మధిర రోడ్డు మీదుగా భగత్‌సింగ్‌ కాలనీ వరకు ఆర్‌ అండ్‌ బీ రహదారిని రూ.14 కోట్లతో అభివృద్ధి చేయడం, సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్‌ ఏర్పాటు, డ్రైనేజీ నిర్మాణం చేపడతామని ప్రకటించారు. ఈ పనులకు శంకుస్థాపన కూడా చేశారు.

అదేవిధంగా కృష్ణానది నుంచి తిరువూరుకు తాగునీరు సరఫరా చేసేందుకు రూ.240 కోట్ల ఏఐబీ నిధులు కేటాయించనున్నట్లు స్థానిక ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన రెండేళ్ల అభివృద్ధి నివేదికలో పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఈ పనులు ప్రారంభం కాకపోవడంపై పట్టణ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హామీల అమలుపై ఎమ్మెల్యే, కూటమి నేతలు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

పంచాయతీ ఎన్నికల వ్యవహారాల్లోనూ ఎమ్మెల్యే పాత్రపై చర్చ

తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల వ్యవహారాల్లోనూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చురుగ్గా కనిపించడం లేదనే చర్చ సాగుతోంది. ఎంపీ కేశినేని చిన్ని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

నామినేషన్ల దాఖలుకు సోమవారంతో గడువు ముగిసినప్పటికీ, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే పూర్తయినట్లు స్థానిక రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల నాటి విభేదాలు, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాత్రపై రాజకీయంగా ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.