40 ఏళ్ల ప్రజాసేవకు ప్రత్యక్ష రాజకీయ అడుగు
గుమ్మడిదూరులో విజయలక్ష్మి విజయమే లక్ష్యంగా పొన్నం బాలాజీ కుటుంబం
అభివృద్ధి, ప్రజాసేవే మా అజెండా పార్టీలకు, కులాలకు అతీతంగా ప్రజలతో మమేకమై పనిచేశాం
పొన్నం విజయలక్ష్మి
దళితుల ఆత్మగౌరవం కోసం రూ.25 లక్షలతో ఎకరం భూమి కొనుగోలు..
గ్రామ అభివృద్ధికి సొంత నిధులతో అండగా నిలిచాం – పొన్నం బాలాజీ
పెనుగంచిప్రోలు మేజర్ న్యూస్ : గ్రామంలో సుమారు నాలుగు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూనే పరోక్షంగా పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు కృషి చేస్తూ వస్తున్నామని, ఇప్పుడు తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి సర్పంచ్ అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తున్నానని కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొన్నం విజయలక్ష్మి తెలిపారు.మంగళవారం గుమ్మడిదూరులోని తమ నివాసంలో భర్త, పోలంపల్లి డ్యామ్ చైర్మన్ పొన్నం బాలాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజాసేవనే ప్రధాన లక్ష్యంగా భావిస్తూ ఇన్నేళ్లుగా ప్రజలతో మమేకమై, పార్టీలకు, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చామని తెలిపారు. ప్రజల ఆదరణ, అభిమానమే తమ కుటుంబానికి నిజమైన బలమని, అదే నమ్మకంతో ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని పేర్కొన్నారు.గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి, కత్తెర గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని ఆకాంక్షించారు.
దళితుల ఆత్మగౌరవం కోసం రూ.25 లక్షలతో ఎకరం భూమి..
ఈ సందర్భంగా గ్రామంలో దళితుల కోసం స్మశానవాటిక అవసరాన్ని గుర్తించి, వారి ఆత్మగౌరవానికి ప్రాధాన్యతనిస్తూ పొన్నం బాలాజీ తన సొంత నిధులతో సుమారు రూ.25 లక్షలు వెచ్చించి ఒక ఎకరం భూమిని కొనుగోలు చేసి స్మశానవాటిక కోసం అందించిన విషయాన్ని విజయలక్ష్మి గుర్తు చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి స్పందించడమే తమ కుటుంబం మొదటి నుంచి అనుసరిస్తున్న విధానమని పేర్కొన్నారు.
ప్రజల కష్టాల్లో తోడుగా నిలవడమే నా లక్ష్యం పొన్నం బాలాజీ
అనంతరం పోలంపల్లి డ్యామ్ చైర్మన్ పొన్నం బాలాజీ మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచే ప్రజాసేవ పట్ల ఆసక్తితో ఉంటూ, ఆపదలో ఉన్నామని తన ఇంటి గడప తొక్కిన ప్రతి ఒక్కరికీ తనవంతు సహాయం చేస్తూ వచ్చానని తెలిపారు. నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా గడపగడపకు వెళ్తున్న సమయంలో ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ, ఆప్యాయత తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయని భావోద్వేగంగా పేర్కొన్నారు.పోలంపల్లి డ్యామ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజలకు అవసరమైన పనుల విషయంలో తనవంతు కృషి చేస్తున్నానని తెలిపారు. ముఖ్యంగా గుమ్మడిదూరు గ్రామంలో వీధిలైట్ల ఏర్పాటు, ఫాగింగ్ యంత్రాల ద్వారా దోమల నివారణ, మంచినీటి పంపులు మరమ్మతులు లేదా పాడైనప్పుడు వాటి స్థానంలో అవసరమైన ఏర్పాట్లు వంటి పనులకు సొంత నిధులతో సహకరించినట్లు వెల్లడించారు.పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండటం, గ్రామానికి అవసరమైన సమయంలో స్పందించడం తన బాధ్యతగా భావిస్తానని బాలాజీ స్పష్టం చేశారు.
అభివృద్ధికి పట్టం కడతారనే నమ్మకం ఉంది
గతంలో చేసిన ప్రజాసేవ, గ్రామానికి అందించిన సహకారం, ప్రజలతో ఉన్న అనుబంధాన్ని గ్రామస్థులు గమనిస్తున్నారని బాలాజీ తెలిపారు. అభివృద్ధి, ప్రజాసేవకు ప్రాధాన్యతనిచ్చే తమ కుటుంబాన్ని గుమ్మడిదూరు ప్రజలు అఖండ మెజారిటీతో ఆశీర్వదిస్తారనే పూర్తి నమ్మకం ఉందని అన్నారు. గ్రామ ప్రజల ప్రేమాభిమానాలతో మరింత బాధ్యతగా పనిచేస్తూ గుమ్మడిదూరును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ ఆకాంక్ష అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, జగ్గయ్యపేట నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.