అన్నారంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు - శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో కన్నులపండువగా దీపోత్సవం, తులసి కళ్యాణం
సూర్య - మానకొండూర్ : కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మానకొండూరు మండలం అన్నారం గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం విశేష పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు దేవరాజ్ అఖిలేష్ శర్మ, ఉప అర్చకులు సాయి శర్మ,ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తుల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో శివాభిషేకం, దీపోత్సవం పౌర్ణమి వేడుకల్లో భాగంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా శివాభిషేకం నిర్వహించారు. అనంతరం జరిగిన దీపోత్సవానికి గ్రామంలోని మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు తమ వెంట తెచ్చుకున్న ప్రమిదలతో పాటు, విశేషంగా గోధుమ పిండితో తయారు చేసిన ప్రమిదల్లో భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. వేలాది దీపాల కాంతులు, 'ఓం నమః శివాయ' నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.వేడుకల్లో భాగంగా నిర్వహించిన తులసి కళ్యాణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కళ్యాణం కోసం ఆలయ ప్రాంగణంలో పచ్చని అరిటాకులతో ప్రత్యేకంగా అందమైన పందిరిని తీర్చిదిద్దారు. ఇద్దరు వేద పండితుల ఆధ్వర్యంలో, వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా తులసి కళ్యాణ తంతును వైభవోపేతంగా జరిపించారు. ఈ వేడుకను తిలకించడానికి మహిళలు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమం అనంతరం భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.