తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్
తాడిగడప, మేజర్ న్యూస్: పెనమలూరు నియోజకవర్గంలోని తాడిగడప మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడిగడప మున్సిపాలిటీలోని నాలుగు గ్రామాల అభివృద్ధికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని, గతంలో ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న రహదారులు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టారని తెలిపారు. సుమారు రూ.250 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పనులు చేపట్టడం వల్ల స్థానిక ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిందన్నారు. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ సదుపాయాల కల్పనలో తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రాధాన్యత లభించిందని పేర్కొన్నారు. తాడిగడప మున్సిపాలిటీ ఏర్పాటై ఆరేళ్లు గడిచినప్పటికీ ఇప్పటివరకు పూర్తిస్థాయి ప్రజాప్రతినిధుల పాలన లేకుండా పరిపాలనా వ్యవహారాలు కొనసాగాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీకి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం, అభివృద్ధిపై స్పష్టమైన దృక్పథం అవసరమన్నారు. కూటమి తరఫున చైర్మన్ అభ్యర్థిగా బరిలో ఉన్న పీతా గోపీచంద్ గతంలో తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా పనిచేశారని, పార్టీ కష్టకాలంలోనూ చురుకుగా వ్యవహరించారని తెలిపారు. ఆయన సేవలను గుర్తించిన కూటమి ప్రభుత్వం అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని కూడా కేటాయించిందని పేర్కొన్నారు. స్థానిక నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండటంతో పాటు ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న పీతా గోపీచంద్ నాయకత్వంలో తాడిగడప మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే చైర్మన్ అభ్యర్థి పీతా గోపీచంద్‌తో పాటు వివిధ డివిజన్లలో పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి గెలిపించాలని షేక్ సలావుద్దీన్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.