బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి
విజయవాడ, మేజర్ న్యూస్: రాజకీయ పదవుల్లో బీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పించాలని, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో రెండో డిప్యూటీ మేయర్ పదవిని బీసీలకు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో కనిశెట్టి లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలు 50 నుంచి 55 శాతం జనాభా కలిగి ఉన్నప్పటికీ రాజకీయ అధికారంలో తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో సుమారు 40 మంది బీసీ కార్పొరేటర్లు గెలుపొందినప్పటికీ డిప్యూటీ మేయర్ పదవి దక్కకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసి రెండో డిప్యూటీ మేయర్ పదవిని ఏర్పాటు చేసి బీసీలకు కేటాయించాలని కోరారు. దుర్గగుడి చైర్మన్, ఇతర కీలక నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల సాధన కోసం అన్ని కుల సంఘాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు, కార్పొరేషన్ ముట్టడి, నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నమ్మి అప్పారావు, సత్యాల సతీష్ కుమార్, అడ్వకేట్ పిల్లా శ్రీనివాసరావు, పిసా అరుణ్ కుమార్, తమ్మినేని దుర్గారావు, బాడిశ రూపేష్, బాడిశ సాంబశివరావు, సగురుపిళ్ల శ్రీకాంత్, కె. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.