సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్
తాడిగడప, మేజర్ న్యూస్ : భారతీయ సాంప్రదాయాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పండుగలను ఘనంగా నిర్వహించడంతో పాటు వాటి వెనుక ఉన్న విలువలను భావితరాలకు అందించాలని మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ అన్నారు. కానూరు 100 అడుగుల రోడ్డులోని అనుమోలు గ్రౌండ్స్‌లో వర్ణం సంస్థ అధిపతులు తోటపల్లి గౌతం, శుభశ్రీ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న దేవీ నవరాత్రి దసరా ఉత్సవాలు, రుద్రయాగ పూర్వక శత చండీ యాగాలకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో దేవీ నవరాత్రులకు విశిష్ట స్థానం ఉందని, తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో ఆరాధించడం వెనుక గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఉందన్నారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రతీకలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆకునూరు మాజీ సర్పంచ్ గోలి వసంతకుమార్, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ప్రేరేపి ఈశ్వర్, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
✍️ ప్రేమ్ రాజ్, తాడిగడప