బోటుతో సహా ఏడుగురు గల్లంతు
- సముద్రంలో సుబ్బంపేట మత్స్యకారుల కోసం గాలింపు
- గరికిన సింహాద్రి బోటులో వేటకు వెళ్లిన ఏడుగురు
- సహాయక చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశం
- కోస్ట్‌గార్డ్, రెవెన్యూ, మత్స్యశాఖలతో సమన్వయం
- గాలింపును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం: కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల సూర్య బ్యూరో (కాకినాడ) : చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు బోటుతో సహా గల్లంతయ్యారు. యు.కొత్తపల్లి మండలం సుబ్బంపేట గ్రామానికి చెందిన గరికిన సింహాద్రి తన బోటులో మరో ఆరుగురితో కలిసి వేటకు వెళ్లారని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. వారి ఆచూకీ గుర్తించి, క్షేమంగా ఒడ్డుకు చేర్చేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
మత్స్యకారుల గల్లంతు విషయం తెలియగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారని ఎంపీ తెలిపారు. గాలింపు, సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారన్నారు. కోస్ట్‌గార్డ్, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి గాలింపు పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు ఎంపీ వెల్లడించారు.