ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ 2026: భారత్‌కు నిరాశ.. వీర్ దాస్, రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్‌కు దక్కని పురస్కారాలు!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: న్యూయార్క్ వేదికగా జరిగిన 54వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల వేడుకలో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఈ ఏడాది భారత్ తరఫున రెండు ప్రధాన విభాగాల్లో నామినేషన్లు దక్కినప్పటికీ, తుది పోరులో ఒక్క ట్రోఫీ కూడా మన దేశానికి దక్కలేదు. ప్రముఖ స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ తన నెట్‌ఫ్లిక్స్ స్పెషల్ ఫూల్ వాల్యూమ్ ద్వారా కామెడీ విభాగంలో పోటీ పడగా, మానవ్ కౌల్ మరియు మహ్మద్ జీషన్ అయూబ్ ప్రధాన పాత్రల్లో నటించిన రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ వెబ్ సిరీస్ ఉత్తమ డ్రామా సిరీస్ విభాగంలో నామినేట్ అయింది. అయితే ఈ రెండు ఎంట్రీలు తుది విజేతలుగా నిలవలేకపోవడంతో భారతీయ అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు.
కామెడీ విభాగంలో వీర్ దాస్‌కు అర్జెంటీనాకు చెందిన డివిజన్ పలెర్మో సీజన్ 2 నుంచి గట్టి పోటీ ఎదురైంది. చివరకు ఆ అర్జెంటీనా సిరీస్ విజేతగా నిలవడంతో వీర్ దాస్ రెండోసారి ఎమ్మీ అవార్డు గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయారు. గతంలో 2023లో వీర్ దాస్ ల్యాండింగ్ షోకు గాను ఆయన ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈసారి అవార్డు దక్కకపోయినా, అంతర్జాతీయ ఎమ్మీ వేదికపై మూడుసార్లు నామినేషన్ దక్కించుకున్న ఏకైక భారతీయ కళాకారుడిగా వీర్ దాస్ అరుదైన ఘనత సాధించారు.మరోవైపు సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ అయిన రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ సిరీస్ ఉత్తమ డ్రామా విభాగంలో ఫ్రాన్స్, యూకే, అర్జెంటీనా దేశాలకు చెందిన సిరీస్‌లతో తలపడింది.
జమ్మూ కశ్మీర్ నుంచి ఆవిర్భవించిన తొలి ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ వాస్తవ ప్రయాణం ఆధారంగా రాజేష్ మపుస్కర్, మహేష్ మథాయ్ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ విభాగంలో ఫ్రాన్స్‌కు చెందిన కరేమ్ సిరీస్ అవార్డును ఎగరేసుకుపోయింది. అయితే ఈ నామినేషన్ వల్ల తమ సిరీస్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, దీనివల్ల మరింత మంది ప్రేక్షకులకు చేరువవుతుందని నటుడు జీషన్ అయూబ్ ఆశాభావం వ్యక్తం చేశారు.నటుడు మైఖేల్ యూరీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలో 22 దేశాలకు చెందిన 64 నామినేషన్లు 16 విభాగాల్లో పోటీ పడ్డాయి. ఇందులో యునైటెడ్ కింగ్‌డమ్ అత్యధికంగా తొమ్మిది ట్రోఫీలను గెలుచుకుని సత్తా చాటింది. కాగా ఈ ప్రతిష్టాత్మక వేడుకలో తమిళ అగ్ర నటుడు విజయ్ సేతుపతి ప్రజెంటర్‌గా పాల్గొని, ఉత్తమ టీవీ మూవీ విభాగంలో ప్రిజనర్ 951 చిత్రానికి అవార్డును అందజేసి భారతీయ సినీ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Also Read: గోల్డెన్ హార్స్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయుడిగా కార్తీక్ విజయ్ చరిత్ర!