కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం...!
ఆనందపురం, మేజర్ న్యూస్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆనందపురం మండలం బోని గ్రామంలోని శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో జ్వాలాతోరణం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
శ్రీ సిద్ధి వినాయక అమరేశ్వర యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక అభిషేకం, బిల్వార్చన, హారతి నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆనందపురం ఎంపీపీ తాట్రాజు అప్పారావు విచ్చేశారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోని గ్రామ అభివృద్ధికి, ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
సాయంత్రం 6 గంటలకు ఆకాశదీపం దీపంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.ఆకాశదీపం వెలిగించడంతో ఆలయ ప్రాంగణం మొత్తం దీపకాంతులతో వెలిగిపోయింది. భక్తులు భక్తితో దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం శ్రీ అమరేశ్వర స్వామి, పార్వతి మాత ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు. పల్లకిలో అమరేశ్వర స్వామివారిని, పార్వతమ్మవారిని గ్రామం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు.108 కలశాలతో నీరు, 108 బుట్టలతో పువ్వులతో గ్రామం చుట్టూ ఊరేగింపు జరిగింది. మహిళలు కలశాలతో, పూల బుట్టలతో ఊరేగింపులో పాల్గొనగా, యువకులు, గ్రామ పెద్దలు మంగళ వాయిద్యాలతో ఊరేగింపును ముందుకు నడిపించారు. గ్రామం మొత్తం శివనామస్మరణతో మారుమోగింది.
ఊరేగింపు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం కార్యక్రమం అత్యంత భక్తిభావంతో జరిగింది. జ్వాలాతోరణం ద్వారా వెళితే పాపాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసంతో తోరణం కింద నుంచి నడిచి వెళ్లారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు సైతం భక్తితో జ్వాలాతోరణంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయం మొత్తం పూలతో, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. భక్తులందరికీ ప్రసాదాలు పంపిణీ చేశారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవా సంఘం సభ్యులు తాగునీరు, కూర్చునే ఏర్పాట్లు, ప్రసాదాల పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సేవా సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.