అంతరంగ పరివర్తనకు దేవతా యోగ
విశాఖఎడ్యుకేషన్, మేజర్ న్యూస్ : ఆత్మాన్వేషణ, అంతరంగ పరివర్తన, చైతన్య వికాసానికి దేవతా యోగ ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక సాధన అని అమెరికాకు చెందిన అంతర్జాతీయ యోగా, ధ్యాన గురువు సాధ్వి స్టెఫనీ రెనీ డాస్ శాంటోస్ పేర్కొన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం యోగా, చైతన్య అధ్యయన విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘దేవతా యోగ’ ప్రత్యేక ఆహ్వాన ఉపన్యాస కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ప్రాచీన యోగ సంప్రదాయమైన దేవతా యోగంలోని తాత్త్విక మూలాలు, ఆచరణాత్మక అంశాలు, ఆధ్యాత్మిక ప్రయోజనాలను వివరించారు.
ధ్యానం, భావనా సాధన, మంత్రోపాసన, అంతర్ముఖ చింతనల సమన్వయంతో సాధకులు తమలోని దైవీ గుణాలను వికసింపజేసుకోవడానికి దేవతా యోగం దోహదపడుతుందని తెలిపారు.
భావోద్వేగ సమతుల్యత, స్వీయ అవగాహన, మానసిక ప్రశాంతత, కరుణ, ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించడంలో దేవతా యోగానికి సమకాలీన జీవన విధానంలో విశేష ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం యోగా, చైతన్య అధ్యయన విభాగాధిపతి ఆచార్య కె. రమేష్ బాబు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
న్యూయార్క్ అచల యోగా ఫౌండేషన్‌లో భారతీయ జ్ఞాన వ్యవస్థల ఆచార్యులు డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ ముఖ్య వక్తను పరిచయం చేశారు. యోగా, ధ్యానం, భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞాన వ్యాప్తికి అంతర్జాతీయ స్థాయిలో ఆమె అందిస్తున్న సేవలను వివరించారు.
యోగం కేవలం శారీరక ఆసనాలకే పరిమితం కాదని, దానిలోని గంభీరమైన తాత్త్విక, అనుభవాత్మక కోణాలను అవగాహన చేసుకోవడానికి ఈ ప్రత్యేక ఉపన్యాసం వేదికగా నిలిచింది.