అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్..
అమలాపురం, మేజర్ న్యూస్ జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, ఉన్నత విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో 11,257 మంది బడిబయట పిల్లలను గుర్తించగా, వారిలో అత్యధిక మందిని తిరిగి పాఠశాలలకు తీసుకురావడం జరిగిందన్నారు. ఇంకా 440 మంది పిల్లల వివరాలు అప్‌డేట్ కావాల్సి ఉందని తెలిపారు. తల్లిదండ్రుల లీప్ యాప్ డౌన్‌లోడ్లలో జిల్లా 47.74 శాతంతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని అధికారులు వెల్లడించారు.
సాధారణ ఫోన్లు ఉన్నవారిని మినహాయించి మిగిలిన తల్లిదండ్రులందరికీ లీప్ యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలోని 23 పీఎం శ్రీ పాఠశాలలకు మంజూరైన రూ.82.98 లక్షలలో 87.69 శాతం నిధులతో ఇప్పటికే సైన్స్ ల్యాబ్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లు, క్రీడా మైదానాలు తదితర అభివృద్ధి పనులకు వినియోగించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఈ పనులను అక్టోబర్ 15లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు
.జిల్లాకు మంజూరైన ప్రత్యేక అటిజం కేంద్రాల నిర్మాణంలో కాంట్రాక్టర్ల సమస్యలపై కూడా కలెక్టర్ సమీక్షించారు. మనబడి–మన భవిష్యత్తు’ కార్యక్రమం కింద మంజూరైన 31 అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనుల పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. వయోజన విద్యలో జిల్లాకు నిర్దేశించిన 36,975 మంది లక్ష్యానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్లు వేగవంతం చేసి, వాలంటీర్ల ద్వారా తరగతులను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
జిల్లాలోని ఆరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సిబ్బంది, విద్యార్థుల ఎఫ్‌ఆర్‌ఎస్ (FRS) హాజరు ప్రక్రియ సజావుగా కొనసాగించాలన్నారు. విద్యార్థుల ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ కాల్స్‌కు స్పందన 80 శాతానికి చేరినట్లు వెల్లడించారు. విద్యార్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా జిల్లాలో నిరుద్యోగ యువతకు శిక్షణ, ఇంటర్వ్యూలు కొనసాగించాలని ఆయన తెలిపారు. పీఎం-సేతు కింద కాకినాడను ఐటీఐ హబ్‌గా అభివృద్ధి చేస్తూ పలు ఐటీఐలను అడాప్ట్ చేసుకునే ప్రక్రియ కొనసాగించాలన్నారు. శిక్షణ పొందిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు.జిల్లాలోని పలు జడ్పీ ఉన్నత పాఠశాలలకు చెందిన భూములు అన్యాక్రాంతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
పాఠశాలల భూములను సర్వే చేసి సరిహద్దులను గుర్తించాలని, అవసరమైన చోట కాంపౌండ్ వాల్స్ లేదా ఇతర రక్షణ చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన సూచించారు.విద్యాశాఖకు సంబంధించిన అన్ని కార్యక్రమాల అమలులో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో సాధించాలని జాల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ స్పష్టం చేశారు.
సమావేశంలో జిల్లా జిల్లా విద్యాశాఖ అధికారి డా.మహబూబ్ బాషా, సమగ్ర శిక్ష ఏపీసీ మమ్మి, డీఐఈవో కె. చంద్రశేఖర రావు, జిల్లా ఉపాధి అధికారి ఆర్.వహిద, పారిశ్రామిక సంస్థ జిల్లా నోడల్ అధికారి ఎంవీజీ.వర్మ, వయోజన విద్యాధికారి జె.విజయభాస్కర రావు; ఉన్నత విద్యాశాఖ అధికారులు, నైపుణ్యాభివృద్ధి సంస్థల సమన్వయకర్తలు తదితరులు పాల్గొన్నారు.